
ఉగాది నాడూ బరి తెగించారు
పర్చూరు(చినగంజాం): ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం పర్చూరులో పెద్ద ఎత్తున కోడి పందేలను నిర్వహించారు. నాగులపాలెం శివారు పొలాల్లోని పెద్ద కాలువ వద్ద కోడి పందేలకోసం బరులను, భారీ ఎత్తున టెంట్‌లు, మైక్ సెట్టింగ్‌లను సైతం ఏర్పాటు వేసి పందేలను నిర్వహించారు. ముందుగానే సమాచారం ఉండటంతో చుట్టు పక్కల జిల్లాలనుంచి పందెం రాయుళ్లు సుమారు 300 మందికి పైగా తరలి వచ్చారు. నెలల తరబడి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు లాంటి ఖరీదైన ఆహారంతో పెంచిన కోడి పుంజులను తీసుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కోడికి కత్తి కట్టేందుకు నిపుణులను కూడా తమ వెంట తెచ్చుకున్నారు. ఒకటికి పది, పదికి యాభై, అంటూ డబ్బు కట్టలు ఊపుతూ నిర్వాహకులు మైకులో హోరెత్తించారు.
గోదావరి జిల్లాల మాదిరిగానే..
ఈ కోడి పందేల్లో రూ.లక్షల్లో చేతులు మారాయి. గత అర్థరాత్రి నుంచి బారికేడ్లు, టెంట్‌లు వేసి అంతా సిద్ధం చేశారు. మద్యం సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. మీడియా వారిని దరిచేరకుండా పలురకాల ఆంక్షలు పెట్టారు. బరి దగ్గరకు వెళ్లే అన్ని మార్గాల్లో నిర్వాహకులు తమ మనుషులను పెట్టి అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలకు అనుమతించారు. ప్రేక్షకులు వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లను కూడా లాక్కొని స్విచ్ ఆఫ్ చేయించారు. పర్చూరు ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున నిషేధిత కోడి పందేలను నిర్వహించడం ఇదే తొలిసారి అని ఇలాంటి సెట్టింగులను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టెంట్‌లను వేసి మైకుల్లో అనౌన్స్ చేస్తూ పందేలను నిర్వహిస్తున్నారంటే ముందుగానే పోలీసు అధికారులందరికీ సమాచారం అందజేసి ఉంటారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఆచారం పర్చూరుకు కూడా పాకిందంటూ పలువురు విమర్శిస్తున్నారు.
పర్చూరులో పండుగ సందర్భంగా జోరుగా కోడి పందేలు పలు జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన పందెం రాయుళ్లు టెంట్‌లు వేసి మరీ పందేల నిర్వహణ ఏలూరు, భీమవరం బరులకు ఏ మాత్రం తీసిపోని సెట్టింగులు రూ.లక్షల్లో చేతులు మారిన వైనం ఫొటోలు, వీడియోలు తీయకుండా పలు ఆంక్షలు సమాచారం ఇచ్చినా కదలని పోలీసు యంత్రాంగం
సమాచారం ఇచ్చినా స్పందించని వైనం
కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారా న్ని కొందరు స్థానిక పోలీసులకు అందించినా వారిలో చలనం లేదని మండి పడుతున్నారు. కోడి పందేల నిర్వాహకులు ముందే పోలీసుల తో ఒప్పందం చేసుకున్నారని లేకుంటే ఇంత భారీ ఎత్తున పందేలు నిర్వహించడం సాధ్యం కాదని కొందరు బహిరంగంగానే చర్చించుకున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో, అధికారుల కనుసన్నల్లోనే బరులు ఏర్పాటు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉగాది నాడూ బరి తెగించారు