
జీవన సత్యాన్ని చాటిన ‘జేబు చెప్పిన ఊసులు’
తెనాలి: పట్టణానికి చెందిన డీఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళాపరిషత్ ఆధ్వర్యంలో 14వ జాతీయస్థాయి నాటకోత్సవాలు మంగళవారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో ఏర్పాటైన నాటకోత్సవాలను ప్రముఖ సినీ రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. తొలిరోజున సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారి ‘జేబు చెప్పిన ఊసులు’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. ‘జేబు నిండుగా ఉంటే మనకు అందరూ ఉంటారు.. అదే జేబు ఖాళీ అయితే మనకోసం ఎవరూ ఉండరు.. జీవితం చివరి రోజుల్లో భరోసా ఉండదు’ అనే నిజాన్ని అర్థవంతంగా చెప్పిందీ నాటకం. మన దగ్గర మనసుంది...మమకారం ఉంది.. వాటితోపాటు డబ్బును కూడా కాపాడుకోవాలనేది నాటక సందేశం. మనిషనేవాడు జాగ్రత్త పడుతూండాలి.. తనకోసం కూడా ఆలోచించుకోవాలి.. విలువైన డబ్బును తన కోసం కొంతయినా జాగ్రత్త చేసుకోవాలి.. ఆ డబ్బే చివరి దశలో ఆసరా అవుతుంది.. లేకుంటే జీవితంలో అభద్రత చోటుచేసుకుంటుంది.. జేబులు చెప్పే నిజాలను పట్టించుకోవాలంటూ ‘జేబు చెప్పిన ఊసులు’ నాటకం మనిషి ఎలా బతకాలో ఎలా బతకకూడదో తెలియచెప్పిన వాస్తవ ఘటనల సమాహారంగా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. స్నిగ్ధ రచించిన నాటకాన్ని మంజునాథ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. ప్రధాన పాత్రల్లో ఎస్‌డీ బాషా, మంజునాథ్, ప్రశాంత్, మల్లాది భాస్కర్, ఆకెళ్ల గోపాలకృష్ణ, కె.శ్రీదేవి నటించారు. సంగీతం నాగరాజు, లైటింగ్ ఉమాశంకర్. నాటకం తదుపరి జరిగిన సభకు కళాపరిషత్ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ రంగస్థల, సినీనటుడు నాయుడుగోపి అధ్యక్షత వహించారు. ఈ సభలో విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రంగస్థల నటి, రచయిత్రి, దర్శకురాలు కె.విజయలక్ష్మికి ఎన్టీఆర్ జీనవ సాఫల్య పురస్కారాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా ప్రదానం చేశారు. విశ్రాంత పోస్టల్ సూపరింటెండెంట్ కె.రమేష్, కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి పీఎస్సార్ బ్రహ్మాచార్యులు, కోశాధికారి ఎ.పోతురాజు పాల్గొన్నారు. కళాపరిషత్ అధ్యక్షుడు డీఎల్ కాంతారావు పర్యవేక్షించారు.
ఆలోచింపజేసిన సాంఘిక నాటకం
జాతీయస్థాయి నాటకోత్సవాలు ప్రారంభం
విశాఖ నటి, రచయిత్రి, దర్శకురాలు విజయలక్ష్మికి ఎన్టీఆర్ జీవనసాఫల్య పురస్కారం

జీవన సత్యాన్ని చాటిన ‘జేబు చెప్పిన ఊసులు’