
సీఎం సభకు వెళ్లేందుకు ఇబ్బందులు పడిన ప్రజలు
చినగంజాం :పేదల సేవలో పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సభ జరిగే ప్రజావేదికకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీ కొత్తగొల్లపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి వందల సంఖ్యలో భారీ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలు తరలి వెళ్లాయి. పలు వాహనాలలో రాష్ట్ర మంత్రులు, శాసనస భ్యులు, పలు జిల్లాల నాయకులు, జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి నిర్వహించే సభా ప్రాంగణానికి తరలి వెళ్లాలంటే రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో వీరంతా నానా అవస్థలు పడి సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి వచ్చింది. ముందుగా చినగంజాం మండల కేంద్రం నుంచి పెదగంజాం, అక్కడి నుంచి కొత్తగొల్లపాలెం గ్రామానికి చేరుకునేందుకు రోడ్లు సక్రమంగా లేవు. మండలంలోని రాజుబంగారుపాలెం పంచాయతీ రాజుబంగారు పాలెం గ్రామ పంచాయతీ అమీన్‌నగర్ గ్రామం నుంచి రొంపేరు బ్రిడ్జి మీదుగా పెదగంజాం చేరుకోవాల్సి ఉండగా సుమారు రెండున్నర కి.మీటర్ల పొడవు రోడ్డు గుంతల మయమై, గులక రాళ్లు లేచి వాహనాలు రాకపోకలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. దాంతోపాటు రోడ్డు మార్జిన్‌లో చిల్లచెట్లు, భారీ గోతులు ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. అంతే గాకుండా ఇదే మార్గంలో ఉన్న కొద్దిపాటి చప్టాకు రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అంతేగాకుండా పెదగంజాం నుంచి కొత్తగొల్లపాలెం రోడ్డు పరిస్థితి కూడా అధ్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. సీఎం సభకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారే కాని రోడ్డు గురించి పట్టించుకోలేక పోయారనే విమర్శలు ప్రజల నుండి వ్యక్తం అయ్యాయి. ఆ మార్గంలో ప్రయాణించే ప్రతి వాహనదారుడు బహింరంగంగానే విమర్శిస్తూ తమ రాకపోకలను కొనసాగించడం కన్పించింది.
గతుకుల రోడ్లతో అవస్థలు పడ్డ వాహనదారులు
కనీస మరమ్మతు చేపట్టని అధికారులు

సీఎం సభకు వెళ్లేందుకు ఇబ్బందులు పడిన ప్రజలు