
సాగు వ్యర్థాల నిర్వహణపై అవగాహన
బాపట్ల: నేల సజీవంగా ఉంటేనే మొక్కలు ఫలవంతమైన ప్రయోజనాన్ని రైతులకు చేకూరుస్తాయని వ్యవసాయ కళాశాల డీన్ డాక్టరు పి.ప్రసూనరాణి పేర్కొన్నారు. దీనికి పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ వ్యవసాయ వ్యర్థాలను పునర్వినియోగించాలని సూచించారు. వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో గురువారం ఐసీఏఆర్, ఎస్సీ సబ్ ప్లాన్‌లో భాగంగా వ్యవసాయ వ్యర్థాల నిర్వహణపై వ్యవసాయ కళాశాల సేద్య శాస్త్ర విభాగంలో రైతులకు అవగాహన, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ వ్యర్థాల ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చని చెప్పారు. సూక్ష్మ జీవులు, వానపాములను కాపాడుకోవడం ద్వారా మట్టి జీవన ప్రమాణాన్ని పెంచవచ్చన్నారు. సాగు రంగంలో విప్లవాత్మక మార్పులను చేపట్టేందుకు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ కార్యక్రమాల్లో రైతులు పాల్గొని లబ్ధి పొందాలని కోరారు. కళాశాలలోని వర్మీకంపోస్టు, అజోల్లా, పుట్ట్టగొడుగుల పెంపకం యూనిట్లను రైతులు సందర్శించారు. సేద్య విభాగాధిపతి డా.కె.చంద్రశేఖర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొండుభొట్లవారిపాలెం గ్రామానికి చెందిన 25 మంది రైతులు, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్సీ సెల్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సుశీల, డాక్టర్ బి.సురేష్ కుమార్, డాక్టర్ డి.వి.ఎస్.అక్షయ్, డాక్టర్ నాయుడు, డాక్టర్ బి.మౌనిక, డాక్టర్ బి.రాజ్యలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.