
ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి
చీరాల టౌన్: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని ప్రభుత్వం ఓ వైపు.....అకాల వర్షంతో అన్నదాతలు పండించిన పంట తడిచి రైతులను నట్టేట ముంచిందని ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈపురుపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో తడిచిన ధాన్యాన్ని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. రబీ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం దారుణమన్నారు. ప్రభుత్వం ధర రూ.1750 ఉండగా రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు, దళారులు బస్తాను రూ.1350కి కొనుగోలు చేయడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రబీ ధాన్యాన్ని మార్చిలోనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోగా అధికారంలోకి వచ్చిన టీడీపీ, కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒకవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, మరోవైపు ప్రభుత్వం పట్టించుకోకపోవడం మళ్లీ అకాల వర్షాల కారణంగా కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోవడంతో అన్నదాత తీవ్రంగా నష్టపోయాడని అన్నారు. రైతుల కష్టాలను గుర్తించి సీఎం చంద్రబాబు బస్తాకు రూ.1750 ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తే పార్టీ తరపున పోరాడి అండగా నిలబడతామన్నారు. రైతులను పరామర్శించిన వారిలో పలువురు నాయకులు ఉన్నారు.