
8వ అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్ : కుంచనపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నుంచి వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ఖాజావలి కథనం ప్రకారం కుంచనపల్లి అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ 8వ ఫ్లోర్‌లో తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన పాటిబండ్ల సదాశివరావు (53) ఆయన భార్య మాధవి, కుమార్తె నివాసం ఉంటున్నారు. ఉదయం బాల్కనీలో వాకింగ్ చేస్తుండగా సదాశివరావు కళ్లుతిరిగి 8వ అంతస్తు పైనుంచి కిందకి పడిపోయాడు. అక్కడికక్కడే మరణించాడు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాజావలి తెలిపారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
పిడుగురాళ్ల: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని న్యూ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించి నడికుడి రైల్వే ఎస్‌ఐ వి.శ్రీనివాసరావు నాయక్ తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి పిడుగురాళ్ల, న్యూ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ల మధ్య, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. ఇతని వయసు సుమారు 40 సంవత్సరాల పైనే ఉండవచ్చునన్నారు. ఆచూకీ తెలియలేదని, ఇతనికి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే నడికుడి రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో ఉంచామన్నారు.