కుక్కకాటు..ప్రాణాలకు చేటు | - | Sakshi
Sakshi News home page

కుక్కకాటు..ప్రాణాలకు చేటు

Apr 9 2025 2:09 AM | Updated on Apr 9 2025 2:09 AM

కుక్క

కుక్కకాటు..ప్రాణాలకు చేటు

గుంటూరు మెడికల్‌: జిల్లాలోని కాకుమానులో ఆరేళ్ల చిన్నారి కౌసర్‌ 2016లో కుక్కలదాడిలో మృతిచెందగా, 2017 సెప్టెంబర్‌ 21న గుంటూరు రూరల్‌ మండలం అడవితక్కెళ్లపాడులో నాలుగేళ్ల ధూపాటి ప్రేమ్‌కుమార్‌ కుక్కలు కరిచి మృతిచెందాడు. తాజాగా స్వర్ణభారతినగర్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఐజాక్‌ ఈనెల 6వ తేదీన కుక్కల దాడిలో చనిపోయాడు. కేవలం పిల్లలే కాకుండా పెద్దవారు సైతం కుక్కకాటు బారిన పడి మరణిస్తున్నారు. ప్రతి ఏడాది జిల్లాల్లో కుక్కకాటు ద్వారా 10 మందికి పైగా మరణిస్తున్నారు. కుక్కకాటు ద్వారా సంభవించే రేబిస్‌ వ్యాధి 2011లో ఉభయ తెలుగు రాష్ట్రాలను వణికించివేసింది. ప్రతి కుక్కలోనూ రేబిస్‌ వైరస్‌ ఉండదు. కానీ వైరస్‌ ఉన్న కుక్క ఏదో తెలియదు. కాబట్టి ప్రతి కుక్కకాటును సీరియస్‌గానే పరిగణించాలి. పిచ్చికుక్క కరిచిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

మనుషులు రేబిస్‌కు గురైతే..

మనుషులు రేబిస్‌ వ్యాధికి గురైనప్పుడు దవడ, గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి ఎంత దాహం వేసినా నీటిని తాగలేరు. ఎక్కువ సందర్భాల్లో రోగి నీటిని చూసినా, నీటి శబ్ధం విన్నా భయకంపితులవుతారు. ఈ లక్షణాన్ని హైడ్రో ఫోబియా అని పిలుస్తారు. ఇలాంటి స్థితిలో మతిస్థిమితం కోల్పోయి ఊపిరి పీల్చుకోలేక మనుషులు కూడా మరణిస్తారు.

కుక్కకాటు బాధితులు....

గుంటూరు జీజీహెచ్‌లో 2023లో 34,931 మంది కుక్కకాటు బాధితులు ఇంజక్షన్లు చేయించుకున్నారు. 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 40,262 మంది కుక్కకాటు బాధితులు ఇంజక్షన్లు చేయించుకున్నారు. 2025 జనవరిలో 3157 మంది, ఫిబ్రవరి 2877 మంది, మార్చిలో 2728 మంది ఇంజక్షన్లు చేయించుకున్నారు. ఏప్రిల్‌ 1న 66 మంది, ఏప్రిల్‌ 2న 95 మంది, ఏప్రిల్‌ 3న 117, ఏప్రిల్‌ 4న 87 మంది, ఏప్రిల్‌ 5న 93, ఏప్రిల్‌ 7న 137 మంది కుక్కకాటు ఇంజక్షన్లు చేయించుకున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి

పిచ్చికుక్క కరిచిన వెంటనే గాయాన్ని చల్లటి నీటితో, సబ్బుతో కడగాలి. గాయంపై నీరు ధారగా పడే విధంగా చేయాలి. గాయంపై టింక్చర్‌ అయోడిన్‌ వేయాలి. గాయానికి కుట్లు వేయటం, ఆయింట్‌మెంట్‌ పూయటం, గాయాన్ని నిప్పుపెట్టి కాల్చటం, కోయటం వంటివి చేయకూడదు. కుక్క కరిచిన వెంటనే సాధ్యమైనంత మేరకు త్వరగా వైద్యులను సంప్రదించి టీకాలు వేయించకోవటం ద్వారా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలి.

– డాక్టర్‌ నరేంద్ర వెంకటరమణ,

ఫిజీషియన్‌, గుంటూరు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో

ఉచితంగా వ్యాక్సిన్లు...

గుంటూరు జీజీహెచ్‌లోనూ, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా కుక్కకాటు బాధితులకు ర్యాబీపూర్‌ వ్యాక్సిన్లు చేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి రోజూ సుమారు 70 నుంచి 80 మంది కుక్కకాటు వ్యాక్సిన్‌ చేయించుకుంటున్నారు. అవుట్‌ పేషేంట్‌ విభాగంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉచితంగా ర్యాబీపూర్‌ వ్యాక్సిన్‌ను చేస్తున్నారు. అత్యవసర విభాగంలో అన్ని వేళలా ఈ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుంది.

– డాక్టర్‌ యశశ్వి రమణ,

గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

రేబిస్‌ వ్యాధి సోకే ప్రమాదం నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు జిల్లాలో ప్రతి ఏడాది 10 మందికిపైగా మృత్యువాత ఇటీవల కుక్కలదాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ర్యాబీపూర్‌ వ్యాక్సిన్లు

కుక్కకాటు మరణాలు

కుక్కకాటుకు సకాలంలో ఇంజెక్షన్లు చేయించకపోవటంతో గుంటూరు గోరంట్లలోని ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిత వ్యాధుల ఆస్పత్రి (జ్వరాల ఆస్పత్రి)లో చికిత్స పొందుతూ 2020లో ఏడుగురు, 2021లో 13 మంది మరణించారు. 2022లో తొమ్మిది మంది, 2023లో 13 మంది, 2024 తొమ్మిది మంది చనిపోయారు.

కుక్కకాటు..ప్రాణాలకు చేటు1
1/2

కుక్కకాటు..ప్రాణాలకు చేటు

కుక్కకాటు..ప్రాణాలకు చేటు2
2/2

కుక్కకాటు..ప్రాణాలకు చేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement