
కిరణ్ ఒక్కడే కాదు.. ఎందరో ఉన్నారు !
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో కిరణ్‌లాంటి వాళ్లు ఎంతో మంది వైఎస్సార్ సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు, మంత్రులు, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడుతూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారందరినీ కూడా ప్రభుత్వం శిక్షించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకిరెడ్డి నాగ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ,ఆయన సతీమణి భారతిపై కిరణ్ చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. పోలీసులు ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా కొంతకాలం నుంచి వైఎస్సార్ సీపీ మహిళలపై, నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులపై అసభ్యకరంగా మార్ఫింగ్‌లు చేసి పోస్టులు పెడుతున్నారని తెలిపారు. కిరణ్‌పైనే కాకుండా మిగిలిన వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మహిళలను కించపరిస్తే సహించమని తెలిపారు. , కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి, రాష్ట్ర బూత్ కమిటీల అధ్యక్షులు కొండమడుగుల సుధాకర్‌రెడ్డి, కొలుసు మోహన్ యాదవ్, కొండకాయల వంశీ, కృష్ణ, సత్తిరెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరినీ శిక్షించాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకిరెడ్డి నాగ నారాయణమూర్తి