
కలంపై కక్షకు నిరసన
సాక్షి ప్రతినిధి,బాపట్ల: కలంపై కూటమి సర్కార్ కక్షగట్టి అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు, ప్రజాసంఘాలు కార్యక్రమాలు నిర్వహించాయియి. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. పాత్రికేయులపై కేసులు పెట్టి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను టీడీపీ వారు హత్యచేసిన విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు ఆరుగురు పాత్రికేయులపై ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బాపట్లలో పాత్రికేయులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తక్షణం సాక్షి పాత్రికేయులపై పెట్టిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెంకట మురళికి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోనూ పాత్రికేయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాత్రికేయులు బి.రమణారెడ్డి, ఆర్.ధనరాజ్, కె.ఉమా మహేశ్వరరావు, యు. శ్రీనివాసరావు, ఎ.కోటేశ్వరరావు, బొట్టు కృష్ణ, సాల్మన్‌రాజు, నారాయణ, కాశిం తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, మరికొందరు పాత్రికేయులపై అక్రమ కేసులు నిరసనగా ఆందోళనకు దిగిన పాత్రికేయులు బాపట్లతోపాటు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తక్షణం కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ అధికారులకు వినతులు సర్కార్ తీరుపై మండిపడుతున్న ప్రజాస్వామ్య వాదులు