
వైఎస్సార్ నాటక కళా పరిషత్ పోటీలు ప్రారంభం
తెనాలి: పట్టణానికి చెందిన డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ జాతీయస్థాయి చతుర్థ ఆహ్వాన నాటికల పోటీలు శనివారం రాత్రి ఘనంగా ఆరంభమయ్యాయి. స్థానిక రామలింగేశ్వరపేట లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రారంభ సభకు పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ తన తండ్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)తో సన్నిహితంగా ఉంటూ, తాను పార్టీలో చేరిన దగ్గర నుంచి అండగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్ నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ జాతీయస్థాయి నాటికల పోటీల నిర్వహణను అభినందించారు. తెనాలి వెలుపల మహనీయుల విగ్రహాలను చూశానని తెలిపారు. కళా, సాహిత్య, సాంస్కృతికరంగాల్లో తెనాలి వైభవాన్ని స్ఫురణకు తెచ్చేలా నాటి ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సోష ల్ మీడియా, ఓటీటీల ట్రెండింగ్‌లో కళలకు ప్రాధాన్యత తగ్గిందన్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వివిధ రంగాల ప్రముఖులకు డాక్టర్ వైఎస్ పేరిట అవార్డులు ఇచ్చి గౌరవించినట్టు గుర్తుచేశారు. సభాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడు తూ కళల తెనాలి వారసుడిగా తాను నాటక కళను ప్రోత్సహిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ ప్రదాత డాక్టర్ రాజశేఖరరెడ్డి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌ను రాజకీయపార్టీల దృష్టితో చూడటం సమంజసం కాదని, వారి పేరుతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ఆదరించాలని సూచించారు. పట్టణ రజక సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ యువనేత పెసర్లంక రమణను ఇదే వేదికపై డాక్టర్ వైఎస్ స్మారక పురస్కారంతో సత్కరించారు. కొల్లిపర శ్రీ కళా నిలయం కార్యదర్శి బొమ్మారెడ్డి ప్రభాకరరెడ్డి, వంగా లక్ష్మారెడ్డి, కఠారి హరీష్, అక్కిదాసు కిరణ్, సిరికృష్ణ మాట్లాడారు. ప్రత్యేక అతిథిగా అన్నాబత్తుని సత్యనారాయణ హాజరయ్యారు. తొలుత నృత్య గురువు వసంతదుర్గ శిష్య బృందం కూచిపూడి, జానపద నృత్యాలను ప్రదర్శించారు. తెనాలి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఆరాధ్యుల కన్నా, అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు.
జాతీయస్థాయి చతుర్థ ఆహ్వాన నాటికల పోటీలు జ్యోతి ప్రజ్వలన చేసిన వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డి.అవినాష్ పెసర్లంక రమణకు వైఎస్సార్ స్మారక పురస్కారం ప్రదానం