
నేలవాలిన పంటలు
అకాల వర్షంతో
బల్లికురవ: ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికందే దశలో ఈదురుగాలుల వర్షం ధాటికి నేలవాలాయి. ఆదివారం సాయంత్రం మండలంలోని కొప్పరపాడు, వైదన, కొమ్మినేనివారిపాలెం, చెన్నుపల్లి, ముక్తేశ్వరం, ఎల్‌ఎల్‌గుడిపాడు, అంబడిపూడి, బల్లికురవ గ్రామాల్లో వర్షం, గాలి ప్రభావంతో కండె దశలో ఉన్న మొక్కజొన్న నేలావాలింది. ఎకరాకు రూ.30 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టామని దిగుబడులు ఆశాజనకంగా ఉన్న పరిస్థితిలో నష్టాలు మిగిల్చాయని రైతులు వాపోయారు. పైగ్రామాల్లో సుమారు. 800 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపోయిన పంటలను పరిశీలించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
గాలివానతో నేలవాలిన మొక్కజొన్న
జే పంగులూరు: అదివారం సాయంత్రం మండలంలోని కొన్ని గ్రామాల్లో గాలితో కూడిన వర్షం పడటంతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని ఏఓ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం గాలివానతో నొలకొరిగిన మొక్కజొన్న పంటను, కారణంగా తడిచిన మొక్కజొన్నను ఏఓ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సోమవారం, మంగళవారం, బుధవారాలు వరకు వాతావరణ శాఖ దక్షిణ కోస్తా జిల్లాలో గాలి, ఉరుములతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారన్నారు. కల్లాలో ఉన్న పంటలను జాగ్రత్త పరుచుకోవాలని తెలిపారు. వీలైతే పంట కోతలు బుధవారం వరకు వాయిదా వేయాలని ఆయన సూచించారు.
బొప్పాయి, అరటి తోటలకు తీవ్ర నష్టం
అద్దంకి: వేసవిలో కురిసిన గాలి వానకు సంతమాగులూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉద్యాన రైతుకు నష్టం కలిగింది.అ అలాగే అద్దంకి మండలంలోని రామాయపాలెం, తిమ్మాయపాలెం, అద్దంకి, తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల్లో పచ్చి ఇటుక వర్షానికి తడిసిపోయింది. ఒక్కో బట్టీల్లో కనీసం రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు నష్టం జరిగిందని యజమానులు తెలిపారు. ఇక సంతమాగులూరు మండలంలోని సంతమాగులూరు, మక్కెనవారిపాలెం గ్రామాల్లో సాగు చేసిన బొప్పాయి, అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

నేలవాలిన పంటలు