
బెట్టింగ్‌లకు పాల్పడితే జీవితం అంధకారమే
బాపట్లటౌన్: బెట్టింగ్‌లకు పాల్పడితే జీవితం అంధకారంగా మారుతుందని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని లాడ్జిలు, హోటల్స్, రిసార్ట్స్, దాబాలు, రెస్టారెంట్‌లలో మంగళవారం తనిఖీలు చేశారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం యువతను బెట్టింగ్ ఊబిలోకి లాగే అవకాశం ఉందన్నారు. అటువంటి వారు ప్రధానంగా లాడ్జిలు, హోటళ్లు, రిసార్ట్స్, రెస్టారెంట్లు, దాబాలను అడ్డాలుగా చేసుకొని వారి కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. అటువంటి వారి కార్యకలాపాలను కట్టడి చేసే ప్రధాన ఉద్దేశంతో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించినా, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమన్నారు. హోటళ్లు, లాడ్జిలు, రిసార్ట్స్‌లో బస చేయడానికి వచ్చే వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి వారి వివరాలను రికార్డులో నమోదు చేసుకోవాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించిన సమాచారం ఉంటే సంబంధిత పోలీసులకు, డయల్ 100, 112 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
లాడ్జిలు, హోటల్స్, రిసార్ట్స్‌లో తనిఖీలు చేసిన పోలీసులు