
డెయిరీ ఫామ్‌లో కార్మికుడు మృతి
అద్దంకిరూరల్: బతుకు తెరువు కోసం బిహార్ రాష్ట్రం నుంచి వచ్చి డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన బుధవారం అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి బికాస్ జయదేవ్ (22) మణికేశ్వరం గ్రామంలోని ఓ డెయిరీ ఫామ్‌లో కొంత కాలంనుంచి పనిచేస్తున్నాడు. ప్రమాద వశాత్తు మిషన్‌ల వద్ద కిందపడి మృతి చెందాడు. సమా చారంతో అద్దంకి సీఐ సుబ్బరాజు, ఎస్‌ఐ ఖాదర్‌బాషా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించి కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఏఎన్‌యూలో నేడు వార్షికోత్సవం
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా, యూనివర్సిటీ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గురువారం జరుగుతాయని వేడుకల కన్వీనర్ ఆచార్య ఎం.త్రిమూర్తిరావు, ఆచార్య సీహెచ్ లింగరాజు, డాక్టర్ డి.రవిశంకర్ రెడ్డి తెలిపారు. వేడుకలకు ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.కృష్ణ తేజ, విశిష్ట అతిథిగా హైదరాబాద్ సీఎస్‌బీ అకాడమీ ప్రతినిధి ఎం.బాలలత, చీఫ్ ప్యాట్రన్‌గా వీసీ ఆచార్య కె.గంగాధరరావు, పాట్రన్స్‌గా రెక్టార్ ఆచార్య కె.రత్నషీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ఓఎస్‌డీ ఆచార్య ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవి కుమార్, గౌరవ అతిథులుగా ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎం.సురేష్ కుమార్, ఆచార్య కె.వీరయ్య, ఆచార్య ఎ.ప్రమీలారాణి హాజరవుతారన్నారు.
ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
యూనివర్సిటీ కళాశాలల యాన్యువల్ డే సెలబ్రేషన్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేడుకల ఏర్పాట్లకోసం ఆరు ప్రత్యేక కమిటీలను నియమించామన్నారు. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు వేడుకల్లో బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.
యార్డుకు 1,59,032 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,59,032 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,57,640 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,500 వరకు లభించింది. తాలు రకం మిర్చి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 76,896 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.