
మాతా, శిశు మరణాలు లేకుండా విధులు నిర్వర్తించండి
చీరాల టౌన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్య సిబ్బంది విధులు సమర్థంగా నిర్వర్తించి గ్రామాల్లో మాతా, శిశు మరణాలు లేకుండా చూడాలని బాపట్ల డీఎం అండ్ హెచ్‌వో ఎస్.విజయమ్మ సూచించారు. గురువారం పట్టణంలోని డోలా ఐజాక్ ఎన్జీవో భవనంలో చీరాల డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తేన్న ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఈవోలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి వైద్యం సకాలంలో సక్రమంగా అందించే బాధ్యత సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లపై ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని మారుమూల ప్రాంతాలు, శివారు కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి వైద్య సేవలందించేలా ప్రణాళికాబద్దంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా ఏఎన్‌ఎంలు, హెచ్‌ఈవోలు, ఆశ కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎక్కడా కూడా మాతా, శిశు మరణాలు లేకుండా చూడాలని, విధుల్లో అశ్రద్ధ వహించినా సకాలంలో వైద్య సేవలందించకపోయినా చర్యలు తప్పవన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు క్రమం తప్పకుండా టీకాలు, వ్యాక్సిన్లు సకాలంలో వేయాలన్నారు. అలానే వేసవిలో వడదెబ్బలు తగలకుండా ప్రజలకు సూచనలు అందించడంతో పాటుగా అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌వోలు విధులు సమర్థంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో పర్చూరు. వెదుళ్లపల్లి, కారంచేడు, చినగంజాం, ఈపురుపాలెం పీహెచ్‌సీలోని ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌వోలతోపాటుగా, పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యాకోబ్, సీహెచ్‌వో మల్లికార్జునరావు, కోటేశ్వరరావు, బాపట్ల 108 ఇన్‌చార్జి డాక్టర్ బ్రహ్మం, సబ్ యూనిట్ అధికారి సీహెచ్ శేషుబాబు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎం అండ్ హెచ్‌వో ఎస్.విజయమ్మ