
సొంతింటి కలపై ధరల పిడుగు
వేటపాలెం: పైసాపైసా కూడబెట్టి సొంతిల్లు నిర్మించుకోవాలనుకునే పేద, మధ్య తరగతి ప్రజల కల నెరవేరేలా లేదు. ప్రస్తుతం ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోవడమే అందుకు కారణం. వారం కిందట సిమెంట్ బస్తా రూ.270 ఉండగా ప్రస్తుతం రూ.320కి చేరింది. అలాగే ఐరన్, ఇటుకలు, ఇసుక, కంకర ధరలు గతేడాది కంటే 30 శాతం పైగా పెరిగాయి. దీనికి తోడు కూలీలు, తాపీమేస్త్రిల కూలి ధరలు భారీగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం తలకు మించిన భారంగా మారింది. దీంతో ఇంటి నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. గృహ నిర్మాణాలు చేసి పేదల సొంతింటి కలను నిజం చేస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ధరల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
నిలిచిన ప్రభుత్వ పక్కా ఇళ్ల పథకం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పక్కా ఇళ్ల పథకం నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే అగిపోయాయి. బాపట్ల జిల్లాలో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 31,167 వేల పక్కా ఇళ్లు మంజూరు చేశారు. వాటిల్లో ఎన్నికల ముందు నాటికి 11 వేలు నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభించారు. ఇంకా 20 వేలు ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన పక్కా ఇళ్ల బిల్లులు కూటమి ప్రభుతం నిలిపి వేసింది. ప్రస్తుతం పెరిగిన భవన నిర్మాణ మెటీరియల్ ధరలు లబ్ధిదారుకు మరింత భారం కానుంది.
ఆకాశంలో భవన నిర్మాణ సామగ్రి ధరలు
వారం వ్యవధిలో బస్తాకు రూ.50 పెరిగిన సిమెంట్ ధర ఐరన్ టన్నుకు రూ.6 వేలు పెరుగుదల 30 శాతం పెరిగిన ఇంటి నిర్మాణ వ్యయం అర్ధంతంగా నిలిచిన నిర్మాణాలు
వ్యాపారం కష్టం మారింది
మేము చాలా కాలంగా సిమెంట్, స్టీల్ షాపు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం సిమెంట్ బస్తాకు రూ.50 పెరిగింది. స్టీల్ ధర టన్నుకు రూ.6 వేలు పెరిగింది. ప్రస్తుతం ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వ్యాపారాలు పెద్దగా లేవు. గతంలో లాగా వ్యాపారాలు జరగడం లేదు.
– నారాయణ, వ్యాపారి, చీరాల
గతంలో ఇప్పుడు ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు వ్యత్యాసాలు
సామగ్రి పేరు గతంలో ప్రస్తుతం
సిమెంట్ బస్తా రూ.270 రూ.320
స్టీల్ కిలో రూ. 57 రూ.65
ఇటుకలు ఒకటి రూ.7 రూ. 11
ఇసుక ట్రాక్టర్ రూ.2 వేలు రూ.4 వేలు
బెల్దారీ కూలి రూ.600 రూ.850
మేస్త్రి కూలి రూ.800 రూ.900
చదరపు అడుగు నిర్మాణ ఖర్చు రూ.2500 రూ.3500

సొంతింటి కలపై ధరల పిడుగు

సొంతింటి కలపై ధరల పిడుగు