
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మారో లారీ
క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్
అద్దంకి: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటనలో క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయిన సంఘటన మండలంలోని శింగరకొండ వద్ద నామ్ రహదారిలో శుక్రవారం జరిగింది. అందిన సమాచారం మేరకు నాగార్జున సిమెంటు కంపెనీ నుంచి డ్రైవర్ నరేంద్ర లారీలో ిసిమెంటు లోడు చేసుకుని ఒంగోలు బయలుదేరాడు. ఈ క్రమంలో లారీ శింగరకొండకు సమీపంలోకి రాగానే అదుపు తప్పి ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దాంతో లారీ క్యాబిన్ లోపలికి చొచ్చుకుపోవడంతో డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై రవితేజ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని, క్యాబిన్‌లో నుంచి డ్రైవర్‌ను బయటకు తీసేందుకు రెండు గంటలపాటు కష్టపడ్డారు. ఎట్టకేలకు పొక్లెయిన్‌తో జాగ్రత్తగా క్యాబిన్‌ను వెనుక్కు వచ్చే విధంగా చేసి డ్రైవర్‌ను బయటకు తీశారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్‌ను 108 వాహనంలో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్యాబిన్‌లో డ్రైవర్ ఒక్కడే ఉండడం, అతను అపస్మారక స్థితిలో ఉండడంతో అతని వివరాలు తెలియరాలేదు.