
పోరంబోకు భూమి అన్యాక్రాంతం
జె.పంగులూరు: కోట్లాది రూపాయల విలువ చేసే పోరంబోకు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు ఆక్రమించిన భూమిలో శాశ్వత కట్టడాలు, రెస్టారెంట్లు, హోటళ్లు నిర్మించుకుంటున్నారు. మరి కొంతమంది మామిడి తోటనే నాటుకున్నారు. అమ్మకాలు చేసి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
పేదల కడుపు కొట్టి...పెద్దలకు..
మండలంలోని కొండమంజులూరు గ్రామ రెవెన్యూ పరిధిలో బొల్లాపల్లి టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి వెంబడి 58 సర్వే నెంబర్‌లో 2.42 ఎకరాల డొంక పోరంబోకు ఉంది. గతంలో కొంత మంది పేదలు ఆ స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వారిని ఖాళీ చేయించారు. అనంతరం ఆ భూమిని పక్కనే ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ వారు ఆక్రమించగా, మిగిలిన భూమిలో కొంత మంది హోటళ్లు నిర్మించారు.
సొంత స్థలాలు మాదిరిగా అమ్మకాలు
ఆక్రమణదారులు వారి సొంత స్థలం మాదిరిగా అమ్ముకుంటూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కొంత మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇస్తున్నారు. గతంలో పేదల గుడిసెలు ఖాళీ చేయించిన రెవెన్యూ సిబ్బంది ప్రస్తుతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎకరా భూమి రూ.2 కోట్లు పైమాటే
ప్రస్తుతం ఆక్రమణకు గురైన 2.42 ఎకరాల భూమి విలువ సుమారుగా రూ.5 కోట్లు పై మాటే. జాతీయ రహదారి వెంబడి ఉండటం, బొల్లాపల్లి టోల్ ప్లాజాకు అతి సమీపంలో ఉండే సరికి పెద్దల కన్ను ఈ భూమిపై పడింది.
సెంటు భూమి కూడా వదలం
–చంద్రశేఖర్‌నాయుడు, ఆర్డీఓ, చీరాల
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ స్థలాన్ని పరిశీలించమని పంగులూరు తహసీల్దార్‌ను ఆదేశించాం. సర్వే చేయిస్తాం. ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఉంటే వారిని వెంటనే ఖాళీ చేయిస్తాం. సెంటు భూమి కూడా వదలం.
ఆక్రమించిన భూమిలో ఇళ్లు, రెస్టారెంట్ నిర్మాణాలు భూమి విలువ రూ.ఐదు కోట్ల పైనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు

పోరంబోకు భూమి అన్యాక్రాంతం