
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
బాపట్లటౌన్: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి వాహనాలను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణా, నేర నియంత్రణ లక్ష్యంగా వాహన తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. జిల్లాలోని చీరాల గడియార స్తంభం సెంటర్, బస్టాండ్ సెంటర్, పేరాల గేటు వద్ద, ఈపురుపాలెం, బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డులో జరిగిన వాహన తనిఖీలలో ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. వాహన తనిఖీలు నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు, ఏఆర్ డీఎస్పీ, ట్రైనీ డీఎస్పీలతో కలిసి జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలను ఎంపికచేసుకొని జిల్లాలోని 31 ప్రదేశాల్లో 3799 వాహనాలను తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు లేని 136 అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. 268 వాహనాలకు చలానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని సంబంధిత కోర్టులో హాజరుపరచునున్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు ప్రవేశించకుండా నిరోధించటానికి, నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు. ప్రజలు రోడ్డు భద్రత నియమాలను, వాహన చట్టాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కారుల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. వాహనదారులు సంబంధిత ధ్రువపత్రాలను కలిగి ఉండాలన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనదారులపైన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేరాల నియంత్రణకే వాహన తనిఖీలు ధ్రువీకరణ పత్రాలు లేని 136 వాహనాలు సీజ్ 14 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు 268 వాహనాలకు చలానాలు విధింపు ఎస్పీ తుషార్ డూడీ