
కొంగు బంగారం.. పోలేరమ్మ తల్లి
చీరాల: కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పేరాల పోలేరమ్మ తల్లి శిడి మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. పోలేరమ్మ గుడి స్థాపించి 50 సంవత్సరాలు పూరైన సందర్భంగా తిరునాళ్లను ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 22న శిడి మహోత్సవం, తిరునాళ్ల నిర్వహించనున్నారు.
తిరునాళ్ల విశిష్టత
చీరాల పట్టణంలో పెద్ద ఎత్తున జరిగే పోలేరమ్మ తిరునాళ్లకు ఎంతో విశిష్టత ఉంది. స్థానిక హరిప్రసాద్‌నగర్‌లో పోలేరమ్మ తల్లి వేంచేసి ఉంది. 49 ఏళ్లుగా ప్రతి ఏడాదీ అమ్మవారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. శక్తి స్వరూపం కలిగి, భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉండే పోలేరమ్మ అమ్మవారి గుడి అంటే చీరాల ప్రాంతంలో మంచి ప్రసిద్ధి ఉంది. తొలుత స్థానిక గ్రామస్తులు చిన్న గుడిని ఏర్పాటు చేసి అమ్మవారిని స్థాపించగా ప్రస్తుతం ఆ దేవాలయం దినదినాభివద్ధి చెంది పట్టణంలోనే విశిష్టత కలిగిన అమ్మ వారిగా పేరు పొందింది. దేవాలయం అభివృద్ధిలో దేవస్థాన కమిటీ, సభ్యులు విశేష కృషి చేశారు. ప్రతివారంలో మంగళ, ఆదివారాల్లో భక్తులు విరివిరిగా వచ్చి విశేష పూజలను నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న భక్తుల కష్టాలు, కోర్కెలను తీర్చే తల్లిగా పోలేరమ్మ తల్లికి పేరుంది. అందుకే ప్రతి ఏడాది అమ్మవారి తిరునాళ్ల, శిడి మహోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. తిరునాళ్ల రోజు శిడి పెళ్లి కొడుకుతో ఊరేగింపుగా అమ్మవారి గుడికి వెళ్ళి గుడి వద్ద ఉండే శిడి మానుకు ఒక పెట్టెలో మేకపోతునుంచి, గుడి చుట్టూ మూడు ప్రదక్షణలు చేస్తారు. ఈ సమయంలో శిడిమాను పైభాగంలో చెక్కపెట్టెలో ఉంచిన మేకపోతును భక్తులు జీడికాయలతో కొడుతుంటారు. శిడిమాను లాగితే కష్టాలు తొలిగిపోతాయని భావించే భక్తులు శిడిమాను బండిని లాగేందుకు పోటీ పడతారు.
ప్రత్యేక కార్యక్రమాలు..
50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది తిరునాళ్లను ఐదు రోజులపాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎల్‌ఈడీ విద్యుత్ ప్రభలు ఆకర్షణగా నిలుస్తాయి. ప్రభలతోపాటు మ్యూజికల్ నైట్, నాటికలు, కళాకారులతో ప్రదర్శనలు, అన్నదానాలు నిర్వహించనున్నారు. తిరునాళ్లను పురస్కరించుకొని పశుసంపదతో పాటు వాహనాలను గుడి చుట్టూ తిప్పి ప్రజలు తమ మొక్కులు తీర్చుకుంటారు. చీరాలతోపాటు పరిసర గ్రామాల నుంచి తిరునాళ్లను చూసేందుకు ప్రజలు వేలాది సంఖ్యలో వస్తుంటారు. భక్తులు అధిక సంఖ్యలో రానున్న సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పేరాల పోలేరమ్మ తల్లి 50 సంవత్సరాలు పూరైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు 22న శిడిమహోత్సవం, తిరునాళ్లు

కొంగు బంగారం.. పోలేరమ్మ తల్లి