
మార్టూరులో 15వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు
మార్టూరు: మార్టూరులోని మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో ఈనెల 24, 25, 26 తేదీలలో 15వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు మద్దుమాల కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎఫర్ట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జేవీ మోహనరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మోహనరావు మాట్లాడుతూ మార్టూరు రోటరీ క్లబ్, శ్రీకారం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నాటికల పోటీలలో మొత్తం తొమ్మిది నాటికలు ప్రదర్శిస్తారని తెలిపారు. శ్రీకారం రోటరీ కళా పరిషత్ తరపున పదో నాటికగా ఎగ్జిబిషన్ ప్లే ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 24వ తేదీ రాత్రి 7.30 గంటలకు న్యూ స్టార్ మోడరన్ థియేటర్ విజయవాడ వారి ’కపిరాజు ’నాటిక, 9 గంటలకు రసఝరి పొన్నూరు వారి ’గురితప్పిన వేట’ నాటిక, 10 గంటలకు యంగ్ థియేటర్ విజయవాడ వారి ‘27వ మైలురాయి’ నాటిక, రాత్రి 11 గంటలకు శ్రీకారం రోటరీ కళా పరిషత్ మార్టూరు వారి ‘50 కోట్లు.... ఆ తరువాత,’ నాటికలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 25 తేదీ రాత్రి 7.30 గంటలకు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ’జనరల్ బోగీలు’ నాటిక, రాత్రి 8.30 గంటలకు శ్రీ చైతన్య కళా స్రవంతి విశాఖ వారి ‘(అ)సత్యం’ నాటిక, రాత్రి 9.30 గంటలకు కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘ఋతువు లేని కాలం’ నాటికలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 26వ తేదీ రాత్రి 7.30 గంటలకు విశ్వశాంతి కల్చరల్ హైదరాబాదు వారి ‘స్వేచ్ఛ’ నాటిక, రాత్రి 9.30 గంటలకు అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ‘విడాకులు కావాలి’ నాటిక, రాత్రి పదిన్నర గంటలకు శ్రీ మైత్రి కళానిలయం విజయవాడ వారి ‘బ్రహ్మ స్వరూపం’ నాటికలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. రోటరీ సభ్యుడు శానంపూడి లక్ష్మయ్య తమ మిత్ర బృందం తరఫున రూ.50 వేల నగదును పరిషత్ నాటికల నిర్వహణ నిమిత్తం మోహనరావుకు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో రోటరీ, శ్రీకారం పరిషత్ ప్రతినిధులు ఖాజా హుస్సేన్, ఈశ్వరప్రసాద్, గొట్టిపాటి శ్రీను, సురేష్, గాలి గంగాధర్, లక్ష్మీనారాయణ, జీవీ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.