
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఇంకొల్లు(చినగంజాం): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధూసూదనరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల స్థితిగతులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సోమవారం ఇంకొల్లులో రైతులతో కలిసి భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గిట్టుబాటు ధర లేదంటూ ఆందోళన చెందిన రైతులు పొగాకును తగలబెట్టి తమ నిరసన తెలిపారన్నారు. దాదాపు 500 మందికి పైగా రైతులు ఈ నిరసనలో పాల్గొనడాన్ని చూస్తే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. రైతు పండించిన పంటలకు గత ప్రభుత్వం మాదిరిగానే గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని, రైతులు పండించిన పొగాకును ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసి నష్టపోకుండా చూడాలని ఆయన కోరారు.
వైఎస్ జగన్ హయాంలో...
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించారని, ఆ సమయంలో రైతులు లాభాలు చవిచూశారన్నారు. ఆయన కల్పించిన ‘మద్దతు’తో ఈ సీజన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి రైతులు పొగాకు సాగు చేపట్టారని గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా స్థానిక రైతులు నల్లబర్లీ పొగాకును ఎక్కువగా పండించారని అన్నారు. ప్రధానంగా పర్చూరు డివిజన్‌లో సుమారు లక్ష ఎకరాలలో నల్ల బర్లీ పొగాకు సాగు చేశారని అన్నారు. పొగాకు పంటను కొనుగోలు చేస్తామని మొదట్లో మాటిచ్చిన కంపెనీలు సైతం నేడు కనిపించకుండా పోవడంతో రైతులను దిక్కుతోచని పరిస్థితులలో సోమవారం రోడ్డెక్కాన్నారు. మరో వైపు మొక్కజొన్న, మిర్చి, మినుము, శనగ, వరి పంటల పండించిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంట దిగుబడులు వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, పంటను గోడౌన్‌లలో నిల్వ చేసి ప్రయోజనం లేదన్నారు. ఈ పరిస్థితులో రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని గాదె మధుసూదనరెడ్డి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల బాధలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే రైతుల తరఫున వైఎస్సార్‌సీపీ అండగా ఉండి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయమై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపి రైతులకు మేలు చేయాలని, అప్పటి వరకు వేచి చూస్తామని లేనిపక్షంలో రైతులతో కలిసి పోరాటం చేయక తప్పదని అన్నారు. ఇంకొల్లులో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు భవనం శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, షేక్ బాబుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, జిల్లా కార్యదర్శి కొండూరి గోవింద్, ఇంకొల్లు, మార్టూరు, చినగంజాం, కారంచేడు, యద్దనపూడి మండల కన్వీనర్‌లు చిన్ని పూర్ణారావు, జంపని వీరయ్యచౌదరి, మున్నం నాగేశ్వరరెడ్డి, జువ్వా శివరామప్రసాద్, రావూరి వేణు, జిల్లా కమిటీ సభ్యులు కోట శ్రీనివాసరావు, తోకల కృష్ణమోహన్, దండా చౌదరి, ఆసోది బ్రహ్మానందరెడ్డి, దాసరి వెంకటరావు, బిల్లాలి డేవిడ్, కరి వాసు, తమ్మా అమ్మిరెడ్డి, గడ్డం మస్తాన్‌వలి, మాచవరపు రవికుమార్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నరన్నారు.
రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
పర్చూరు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి