
చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు
గుంటూరు రూరల్: చిరునామా అడుగుతున్నట్లు నటించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే మామా అల్లుళ్లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అడవితక్కెళ్ళపాడులోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ డీఎస్పీ భానోదయ ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. పాతగుంటూరు యాదవ బజారుకు చెందిన బాణావత్ బద్రునాయక్, పల్నాడు జిల్లా మాచర్ల మండలం చింతలతండా గ్రామానికి చెందిన కేతావత్ శరత్‌లు మేనమామ, మేనల్లుడు. నగరంలో ఆటోలు నడుపుతూ వ్యసనాలకు బానిసలయ్యారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్‌లను ఎన్నుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళుతూ ఒంటరిగా వెళుతున్న మహిళలను అడ్రస్ అడుగుతున్నట్లు నటించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ పారిపోయేవారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఓ మహిళ మెడలోని 20 గ్రాముల బంగారు చైన్‌ను ఇదే తరహాలో లాక్కెళ్లారు. నల్లపాడు సీఐ వంశీధర్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం ఉదయం వై జంక్షన్ వద్ద తిరుగుతున్న ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి పోలీసులు 20 గ్రాముల బంగారం, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ, సీఐని, ఎస్‌ఐ వాసు, సిబ్బంది సుబ్బారావు, మస్తాన్‌వలి, నరుల్లాలను జిల్లా ఎస్పీ అభినందించారు.