
చినగంజాం స్టేషన్‌లో సమస్యల కూత
చినగంజాం: కోట్లాది రూపాయలు వెచ్చించి రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించారు..కానీ కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. రైల్వే అధికారులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకు చినగంజాం రైల్వేస్టేషన్‌లో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. రైల్వేస్టేషన్‌ల ఆధునికీకరణకు రైల్వే శాఖ భారీగా నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో చినగంజాం రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించారు. అందులో భాగంగా ఆధునిక సౌకర్యాలతో భవనం నిర్మించారు. ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, సాంకేతిక సౌకర్యాల పెంపు, నూతన ఫ్‌లై ఓవర్, ఫ్లాట్ ఫారాల పొడిగింపు, తాగునీటి కుళాయిలు, మరుగుదొడ్లు నిర్మించారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవం చేసిన తర్వాత కొద్ది రోజులు మాత్రమే సౌకర్యాలు కొనసాగించారు. ఆ తర్వాత నుంచి వాటి గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
రిజర్వేషన్ సౌకర్యం తొలగింపు
దశాబ్దాలుగా చినగంజాం రైల్వేస్టేషన్‌లో కొనసాగుతున్న రిజర్వేషన్ సౌకర్యాన్ని రైల్వే అధికారులు తొలగించారు. స్టేషన్ ఆధునీకరణతో స్టేషన్‌లో సౌకర్యాలు మెరుగు అవుతాయనుకున్న ప్రయాణికులకు నిరాశ ఎదురైంది. మెరుగైన సాంకేతిక వ్యవస్థతో నిర్మాణం చేసినప్పటికీ రిజర్వేషన్ సౌకర్యాన్ని మాత్రం ఎత్తివేశారు. స్థానిక ప్రయాణికులు రిజర్వేషన్ కోసం చీరాల, ఒంగోలు స్టేషన్‌లకు పరిగులెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లక్షలు వెచ్చించి స్టేషన్ ఆధునికీకరణ కనీస సౌకర్యాలు లేక ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని రైల్వే అధికారులు