
పంట కాలువల మరమ్మతులు చేయాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: జల వనరుల కింద పంట కాల్వల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. డీఆర్‌సీలో ప్రజా ప్రతినిధులు చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. గుంటూరు ఛానల్, నల్లమడ కాల్వల అభివృద్ధి పనులు శరవేగంగా చేపట్టాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని రైతుల శ్రేయస్సు కోసం ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అద్దంకి నియోజకవర్గంలో మంజూరైన పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. గుంటూరు ఛానల్ విస్తరణకు నాలుగు ఎకరాల స్థలం భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే రూ.15 కోట్ల నిధులు మంజూరు కావాలని ప్రభుత్వానికి నివేదిక పంపిన విషయాలపై సమీక్షించారు. మైనర్ కాల్వలపై 119 మరమ్మతు పనులకు రూ.10.68 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రస్తుతం అవన్నీ టెండర్ దశలో ఉన్నాయన్నారు. పంట కాల్వల మరమ్మతు పనులు, పూడికతీత పనులు చేయడానికి ప్రభుత్వం 454 పనులు గుర్తించిందన్నారు. యుద్ధప్రాతిపదిక వాటిని చేపట్టేందుకు రూ.12.59 కోట్ల నిధులు జిల్లాకు మంజూరయ్యాయన్నారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న పంట కాల్వలకు తాత్కాలిక మరమ్మతులు చేయడానికి 148 పనులు గుర్తించామన్నారు. రూ.7.75 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో పంట కాల్వలు నీరు లేనందున మరమ్మతు పనులు వేగంగా ప్రారంభించాలన్నారు. వేసవి ముగిసేలోపు ఆ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అనంతరం వివిధ శాఖల్లో జరుగుతున్న పనులపై ప్రజా ప్రతినిధులు చర్చించిన అంశాలు, అధికారులు తీసుకున్న చర్యల గురించి ఆయన ఆరా తీశారు. సమావేశంలో సీపీఓ కె శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.