
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
నిజాంపట్నం/ రేపల్లె రూరల్: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలం కొత్తపాలెం ఫిష్ లాండింగ్ సెంటర్ వద్ద శనివారం మత్స్యకారులకు వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడి జీవిస్తూ ఉంటారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధభృతిని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.
మత్స్యకారులకు అవసరమైన వలలు, బోట్లు, మోటార్ సైకిళ్లను సబ్సిడీ కింద మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. సముద్రంలో చేపలు పొదుగు కాలం కావడంతో ఏప్రిల్ 15 నుంచి జూన్ 16వ తేదీ వరకు వేట నిషేధ కాలంగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా రూ.20 వేలు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు. మరో వైపు ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన చెప్పారు. నిజాంపట్నం దుండి ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పర్యాటక కేంద్రంగా
మడ అడవులు ప్రాంతం ...
జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మాట్లాడుతూ మత్స్యకారులు వేట నిషేధ కాలం భృతిని సద్వినియోగం చేసు కోవాలని చెప్పారు. నిజాంపట్నం మడ అడవుల ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం బాపట్ల జిల్లాకు చెందిన 12,671 మంది మత్స్యకారులకు రూ.25 కోట్ల 34 లక్షల 20వేల మెగా చెక్కును మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా ఫౌరసరఫరాల శాఖ అధికారి విలియమ్స్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ మత్స్యకారులకు వేట నిషేధ భృతి చెక్కు అందజేత