భద్రాద్రి: వర్షాలు, వరదలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వ సిబ్బంది పని చేసే కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉండాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు.
రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో గోదావరి వరద పరిస్థితిపై భద్రాచలం ఆర్డీఓ కార్యాలయం నుంచి రాత్రి రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, రహదారులు భవనాలు, మిషన్ భగీరథ, విద్యుత్, వైద్య, సెక్టోరియల్, మండల ప్రత్యేక అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లా ఆరెంజ్ జోన్‌లో ఉందని తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు హై అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన టీములు, ప్రత్యేక అధికారులు, సెక్టోరియల్ అధికారులు కేటాయించిన మండలాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని వివరించారు. సమస్యాత్మక, ముంపునకు గురయ్యే ప్రాంతాల సమగ్ర జాబితా సిద్ధంగా ఉండాలని, చెరువుల పరిరక్షణ చర్యలు చేపట్టాలని, ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రించాలని చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలి
శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, నీట మునిగే ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్లు అడ్డుగా పెట్టాలని వివరించారు. ములకలపల్లిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. మండల స్థాయి బృందాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా విద్యుత్ సమస్య రావొద్దని, ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించాలని, తాగునీటి సమస్య వచ్చిన ప్రాంతాల్లో పంచాయతీ, రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు.
తాగునీటి పరీక్షలు చేయాలన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లకుండా చూడాలన్నారు. రెండు రోజులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, నీళ్లు నిలిచే ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేసేందుకు పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మధుసూదన్ రాజు, ఇతర అధికారులు భీమ్లా, డాక్టర్ శిరీష, డాక్టర్ రవిబాబు, మరియన్న, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలు
బుధవారం జిల్లాలో ఒక్క దమ్మపేట మండలం మినహా జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. కరకగూడెం మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 22 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత భారీ వర్షపాతం నమోదైన మండలాల్లో చర్ల, పినపాక, సుజాతనగర్, ఇల్లెందు, కొత్తగూడెం మండలాలు ఉన్నాయి. మిగిలిన మండలాల్లోనూ భారీగానే వానలు పడ్డాయి.
రెండో ప్రమాద హెచ్చరిక
బుధవారం ఉదయం నుంచి తాలిపేరు ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన వర్షాలతో దాదాపు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రాజెక్టుకు చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లన్నింటినీ ఎత్తి కిందకు వదులుతున్నారు. మరోవైపు ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి వరదకు తాలిపేరు కూడా జతవ్వడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 48 అడుగులకు వరద రాలేదు. కానీ బుధవారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను దాటుకుని 49 అడుగుల పైకి వరద చేరుకుంది. దీంతో ముందు జాగ్రత్తగా భద్రాచలంలోని కొత్తకాలనీ, చర్ల మండల దండుపేట, రాళ్లగూడెం లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటీవల బదిలీపై వెళ్లిన ఐఏఎస్ అధికారి అనుదీప్ భద్రాచలం కేంద్రంగా వరద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆపదలో ఉంటే..
ఆపదలో ఉన్నవారు తమ ఫొటోలు, వాట్సాప్ లొకేషన్, పంపి పోలీసుల సేవలు పొందాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. జిల్లా పోలీస్ రెస్క్యూ కంట్రోల్ వాట్సాప్ నంబర్ 87126 82128కు ఫోన్ చేసి సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. కంట్రోల్ రూమ్ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment