మిర్చి రైతులకు కన్నీరే
ధరల పతనంతో దిగాలు
●పెరుగుతున్న కూలీ రేట్లు ●తెగుళ్లతో తగ్గుతున్న దిగుబడులు
బూర్గంపాడు: మిర్చి రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. ధరల పతనంతో అప్పులు తీరే మార్గం కనిపించక ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేసిన మిర్చిని అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న ధరలతో రైతులు మరింతగా కుదేలవుతున్నారు. ఓ పక్క సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. కూలీలు రేట్లు పెంచారు. పంట అమ్మితే కూలీల డబ్బులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. మిర్చి అమ్మకాలకు జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం లేదు. ప్రైవేట్ వ్యాపారులు కల్లాల వద్దకు వచ్చి మిర్చి కొనే పరిస్థితులు లేవు. రైతులు ఖమ్మమో, గుంటూరో, జగ్దల్‌పూరో తీసుకెళితే అక్కడ వ్యాపారులు అడిగిన కాడికి అమ్మాల్సి వస్తోంది. ప్రస్తుతం మిర్చి అమ్మకుండా కొంతకాలం నిల్వచేసుకుందామన్న కోల్డ్ స్టోరేజీలు లేవు. ఈ పరిస్థితులు మిర్చి రైతులను కలవరపెడుతున్నాయి.
25 వేల ఎకరాల్లో సాగు..
ఈ ఏడాది జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగుచేశారు. గతేడాది 40 వేల ఎకరాల్లో సాగు చేయగా.. నల్ల తామరతో నిలువునా ఎండిపోయాయి. రైతులకు ఎకరాకు ఐదారు క్వింటాళ్ల దిగుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయారు. గతేడాది మిర్చికి క్వింటాకు రూ.20 వేల వరకు ధర పలికింది. దిగుబడులు పూర్తిగా తగ్గినా కొంతమేర ధర ఉండటంతో పెట్టుబడులు సగం మేర తిరిగి వచ్చాయి. గతేడాది నష్టాలతో ఈ ఏడాది జిల్లాలో మిరపసాగు 15 వేల ఎకరాల వరకు తగ్గింది. గతేడాది అప్పులు, ఈ ఏడాది పెట్టుబడులు తిరిగి వస్తాయనే గంపెడాశలతో రైతులు మిర్చి సాగు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నల్లతామర, తెగుళ్లు రాకుండా మిర్చికి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టారు. రసాయనిక మందులతో పాటు ఎక్కువ రేటు ఉన్న ఆర్గానిక్ మందులు కూడా రైతులు మిరపతోటలపై పిచికారీ చేశారు. మిర్చి తొలి విడత కాపులో నల్లతామర ఆశించకపోవటంతో కొంతమేర దిగుబడులు వచ్చాయి. నెలరోజులుగా నల్లతామర విజృంభిచటంతో దిగుబడులు పడిపోతున్నాయి. ఈ ఏడాది ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశముంది. తొలి, మలి విడత మిర్చి కోతలు అయిన తరువాత రైతులు కల్లాల్లో ఆరబోసి గ్రేడింగ్ చేసిన మిర్చిని అమ్ముకునేందుకు ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతున్నారు. మిర్చికి మార్కెట్‌లో క్వింటాకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు మాత్రమే ధర పలుకుతోంది. గతంలో వ్యాపారులు కల్లాల వద్దనే మిర్చిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ధర లేకపోవటంతో వ్యాపారులు గ్రామాల వైపు రావటం లేదు. దీంతో రైతులు మిర్చి బస్తాలను లారీలు, వ్యాన్‌లలో దూర ప్రాంతాల మార్కెట్‌కు తీసుకెళ్లాల్సి వస్తోంది.
రేట్లు పెంచిన కూలీలు
మిర్చి సాగులో ఈ ఏడాది కూలీ రేట్లు బాగా పెరిగాయి. గతంలో మిర్చి కోసిన మహిళా కూలీలకు రోజుకు రూ.300 చెల్లించేవారు. ఈ ఏడాది కూలి రేటు రూ.350కి పెరిగింది. ఒక క్వింటా మిర్చి కోసేందుకు రూ.3 వేల వరకు ఖర్చవుతోంది. గ్రేడింగ్, బస్తాల్లో నింపుడు, ట్రాన్స్‌ఫోర్ట్‌కు క్వింటాకు మరో రూ.3 వేల వరకు ఖర్చవుతోంది. క్వింటా మిర్చి రూ.10 వేలకు అమ్మితే ఆ డబ్బులు కూలీలకు, ట్రాన్స్‌ఫోర్ట్‌కే సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మిర్చి మార్కెట్ లేకపోవటం కూడా రైతులకు శాపంగా మారింది. ప్రస్తుతం ధరలు లేకపోవటంతో కోల్డ్‌స్టోరేజీలలో నిల్వ చేసుకోవాలన్నా జిల్లాలో కోల్ట్ స్టోరేజీలు లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. పత్తి, వరి, అపరాల పంటల మాదిరిగానే ప్రభుత్వం మిర్చికి కూడా మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర లభించనప్పుడు ప్రభుత్వాలే రైతుల నుంచి మిర్చిని కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
సగం పెట్టుబడి కూడా రాదు..
గతేడాది మిరపతోట వేస్తే ఎకరానికి రూ.లక్ష నష్టం వచ్చింది. ఆ అప్పులు తీర్చేందుకు ఈ ఏడాది మళ్లీ అప్పు చేసి మిరప తోట వేశాను. ఎకరాకు 10క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కానీ, రేటు క్వింటా రూ.10 వేలకు కూడా అడగటంలేదు. గుంటూరు, ఖమ్మం లేదా జగదల్‌పూర్ తీసుకుపోవాలంటే లారీ కిరాయి పెట్టుకోవాలి. కనీసం సగం పెట్టుబడి కూడా రాదు.
– యారం వెంకటరెడ్డి, రైతు, సంజీవరెడ్డిపాలెం
రైతులను ఆదుకోవాలి
మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మిర్చికి కనీసం రూ.20 వేలు ధర పలికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతులు పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా రావటం లేదు. ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులున్నాయి. మిర్చి రైతుల తరఫున పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలకు దిగుతాం.
– బత్తుల వెంకటేశ్వర్లు, సీపీఎం మండల కార్యదర్శి
మిర్చి రైతులకు కన్నీరే
మిర్చి రైతులకు కన్నీరే
Comments
Please login to add a commentAdd a comment