పర్మిట్లతో పనేంటి ? | - | Sakshi
Sakshi News home page

పర్మిట్లతో పనేంటి ?

Published Wed, Feb 19 2025 12:11 AM | Last Updated on Wed, Feb 19 2025 12:10 AM

పర్మి

పర్మిట్లతో పనేంటి ?

దేశవ్యాప్తంగా సరుకుల రవాణాలో లారీలది కీలక పాత్ర. స్టేట్‌ పర్మిట్‌, నేషనల్‌ పర్మిట్‌ రూపంలో సరుకు రవాణా చేసేందుకు లారీ యజమానులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుంది. స్టేట్‌ పర్మిట్‌ పొందిన లారీ ఆ రాష్ట్రంలో మాత్రమే సరుకులు రవాణా చేయాల్సి ఉంటుంది. నేషనల్‌ పర్మిట్‌ కలిగిన లారీ ఒక రాష్ట్రంలోని సరుకు తీసుకుని మరో రాష్ట్రంలో రవాణా చేయొచ్చు. ఆయా లారీలకు మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కాల పరిమితితో ప్రభుత్వం పర్మిట్లు మంజూరు చేస్తుంది.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

నిబంధన ఉల్లంఘిస్తే నేరమే..

రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో అనుమతి పొందిన లారీ ఆ రాష్ట్రం దాటి ఇతర ప్రాంతాల్లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ లేదా రవాణా చేస్తూ పట్టుబడితే నేరంగా పరిగణిస్తారు. అలాగే నేషనల్‌ పర్మిట్‌ పొందిన లారీ రెండు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేయకుండా ఒక రాష్ట్రంలో లోడ్‌ చేసుకుని అదే రాష్ట్రంలో అన్‌లోడ్‌ చేయడం కూడా నేరంగానే పరిగణిస్తారు. ఆర్టీఏ అధికారులు తనిఖీ చేసినప్పుడు ఇలా పట్టుబడిన లారీలకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తారు.

జిల్లా మీదుగా వందల లారీలు..

భద్రాద్రి జిల్లా ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. ఈ జిల్లా మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వీటితో పాటు సింగరేణి, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు, నవ లిమిటెడ్‌, భద్రాచలం పేపర్‌ బోర్డు, పామాయిల్‌ పరిశ్రమలూ ఉన్నాయి. దీంతో నేషనల్‌ పర్మిట్లు పొందిన వందలాది లారీలు జిల్లా మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో కేంద్ర కార్యాలయాలు ఉన్న పలు కంపెనీలు నేషనల్‌ పర్మిట్‌ కలిగిన తమ లారీలను ఈ జిల్లా కేంద్రంగా ఆపరేట్‌ చేస్తున్నాయి. జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఉన్నాయి. ఈ చెక్‌పోస్టుల గుండా వెళ్లే ప్రతీ సరుకు రవాణా వాహనాన్ని ఆపి తనిఖీ చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోనే రవాణా..

గోదావరి తీరం వెంట విస్తరించిన ఓ భారీ పరిశ్రమ తన అవసరాల కోసం రవాణా రంగంలో ఉన్న కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానించింది. దేశ వ్యాప్తంగా పేరున్న పలు కంపెనీలు ఈ బిడ్‌లో పాల్గొని టెండర్‌ దక్కించుకున్నాయి. నాలుగైదు కంపెనీలకు చెందిన సుమారు 150 లారీలు ఈ పరిశ్రమ కేంద్రంగా రవాణా రంగంలో సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ నేషనల్‌ పర్మిట్‌ కలిగిన లారీలే. అయితే ఇందులో సుమారు 120 లారీలు నిబంధనలు ఉల్లంఘిస్తూ సదరు పరిశమ్ర ఉత్పత్తులను హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ముఖ్య పట్టణాలకూ రవాణా చేస్తుండడం గమనార్హం.

స్థానికులకు నష్టం..

ఇక్కడున్న పరిశ్రమలను నమ్ముకుని అనేక మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతంగా లారీలు కొనుగోలు చేశారు. బడా కంపెనీలకు చెందిన నేషనల్‌ పర్మిట్‌ లారీలు నిబంధనలు అతిక్రమిస్తూ సరుకు రవాణా చేయడంతో జిల్లాకు చెందిన స్థానిక లారీ యజమానులకు రావాల్సిన ట్రాన్స్‌పోర్టు ఆర్డర్లు దారి తప్పుతున్నాయి. దీంతో నెలవారీ కిస్తీలు కట్టడం కూడా కష్టంగా మారిందని స్థానిక లారీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై వివరణ కోసం జిల్లా రవాణా శాఖ అధికారిని ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

ట్రాన్స్‌పోర్టు సెక్టార్‌లో బడా కంపెనీల హవా..

సరుకు రవాణా నిబంధనలు బేఖాతర్‌

నేషనల్‌ పర్మిట్‌ లారీలతో నష్టపోతున్న స్థానికులు

చోద్యం చూస్తున్న రవాణా శాఖ

కాసులిస్తే సరి..

నేషనల్‌ పర్మిట్‌ ఉన్న లారీలు జిల్లాలో సరుకు లోడ్‌ చేసుకుని హైదరాబాద్‌లో అన్‌లోడ్‌ చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే కేసు బుక్‌ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మరోసారి ఇలాంటి పని చేయకుండా కనీసం మూడు నెలల వరకు స్టేట్‌ పర్మిట్‌ తీసుకునేలా చూడడంతో పాటు అదనంగా జరిమానా కూడా విధించాలి. కానీ జిల్లాలో ఉన్న రెండు చెక్‌పోస్టుల్లో ఇలాంటివేమీ జరడగం లేదు. నిబంధనలు ఉల్లంఘనకు ప్రతిఫలంగా లారీకి ఇంత అని రవాణా శాఖ తనిఖీ కేంద్ర సిబ్బంది చేతులను కాసులతో తడిపితే సరిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాల్వంచ తనిఖీ కేంద్రంపై లెక్కకు మిక్కిలి ఈ తరహా ఆరోపణలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
పర్మిట్లతో పనేంటి ?1
1/2

పర్మిట్లతో పనేంటి ?

పర్మిట్లతో పనేంటి ?2
2/2

పర్మిట్లతో పనేంటి ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement