● ఎఫ్‌డీఓ దామోదర్ రెడ్డి వెల్లడి
అశ్వారావుపేటరూరల్: జిల్లాలో అడవుల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని, ఇప్పటిదాకా 500 హెక్టార్లలో పోడు భూములను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌డీఓ దామోదర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక ఫారెస్టు రేంజ్ కార్యాలయం వద్ద ఉన్న నర్సరీని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అడవుల పునరుద్ధరణ కార్యక్రమానికి ఫారెస్టు నర్సరీల్లో ఐదు లక్షల మొక్కలను పెంచుతున్నామని తెలిపారు. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం (జీసీపీ)లో మొక్కలు నాటేందుకు అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో 75 హెక్టార్లు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పోడు భూముల్లో 135 హెక్టార్లలో ప్లాంటేషన్ల కోసం వెదురు, టేకుతోపాటు పలు రకాల మొక్కలను సిద్ధం చేసినట్లు చెప్పారు. అశ్వారావుపేట ఫారెస్టు చెక్‌పోస్టుకు సంబంధించిన స్థలం తమదేనని, అయితే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలిపారు. చెక్‌పోస్టు చుట్టూ ఉన్నవారంతా ఆక్రమణదారులేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ రేంజర్ మురళి, సెక్షన్ ఆఫీసర్ కృష్ణమూర్తి, ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు ఉన్నారు.
మున్సిపల్ అధికారులపై విచారణ
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగ విరమణ వయసుకు మించి రెండు ఏళ్లు అదనంగా విధులు నిర్వహించిన వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టారు. మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్ 60 ఏళ్లు, ట్రాక్టర్ డ్రైవర్ 58 ఏళ్లకు ఉద్యోగ విరమణ పొందుతారు. జి. వెంకటి అనే ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం 58 ఏళ్లకు ఉద్యోగ విరమణ పొందకుండా 60 ఏళ్ల కాలంపాటు పనిచేశాడు. అప్పుటి కమిషనర్ అంజన్‌కుమార్, మేనేజర్ నూరుల్లా, యాకుబ్‌పాషాలు అతని సర్వీస్ బుక్ తనిఖీ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ ముగ్గురు అధికారులు ఇల్లెందు నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. తర్వాత వచ్చిన అధికారులు వెంకటికి రావాల్సిన నగదును నిలిపి వేశారు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు తీర్పు మేరకు అతనికి డబ్బులు చెల్లించారు. అదనపు రెండు ఏళ్ల సర్వీస్ కింద రూ. 15 లక్షలకు పైగా చెల్లించారు. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత ఇల్లెందు మున్సిపాలిటీలో విచారణ చేపట్టారు. రికార్డులు, జీఓలు, సర్వీస్ బుక్‌తోపాటు వెంకటి పని చేసిన కాలం, చెల్లించిన జీతం, ఉద్యోగ విరమణ తర్వాత లభించిన డబ్బుల వివరాలు తనిఖీ చేశారు. ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు.
బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి మృతి
కొత్తగూడెంటౌన్: పట్టణ పరిధిలోని వేణుగోపాలస్వామి గుడి సమీపంలో అదే ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు, ఎలక్ట్రీషియన్ నరసింహా(36) మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో స్థానికులు బుధవారం గుర్తించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... వేణుగోపాల్ నగర్ కాలనీవాసులు ఉదయం మార్కెట్‌కు వెళ్తున్న క్రమంలో దుర్వాసన వస్తుండగా మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నరసింహా మంగళవారం ఉదయం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. కాగా బహిర్భూమికి వెళ్లి అక్కడే పడిపోయి మృతి చెందాడని భావిస్తున్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
జూలూరుపాడు: మానసిక వేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఏఎస్సై కోటేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ జడలచింతకు చెందిన దబ్బా నరసింహారావు, సత్యావతి దంపతుల కుమారుడు అరవింద్ కుమార్(20) ఇంటర్ వరకు చదువుకున్నాడు. పాపకొల్లుకు చెందిన ఓ ఆర్‌ఎంపీ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ముభావంగా ఉంటూ చనిపోతానంటూ చెబుతుండగా తల్లిదండ్రులు మనోధైర్యం చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం అరవింద్ కుమార్ పురుగుల మందు తాగి ఇంట్లో అపస్మారకస్థితిలో పడి ఉండగా, కుటుంబ సభ్యులు గమనించి కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment