కొరవడిన చిత్తశుద్ధి
గిరిజన
అభివృద్ధి..
భద్రాచలం: గిరిజనుల సమస్యలపై చర్చించి, పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమానికి చేపట్టాల్సిన ప్రణాళికలు రూపొందించేందుకు ప్రతీ మూడు నెలలకోసారి ఐటీడీఏ పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఏడాది దాటినా ఈ విషయాన్ని అటు ప్రభుత్వం, ఇటు ఐటీడీఏ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందనే ప్రచారంతో సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలియదు.
గిరిజనులపై శీతకన్ను..
గిరిజనులను అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం ఐటీడీఏలను ఏర్పాటుచేసింది. అధికారులు, ఐటీడీఏ పరిధిలోని ప్రజాప్రతినిధులు ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై గిరిజనుల సంక్షేమానికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించాలి. కానీ గతేడాది ఫిబ్రవరి 18న సమావేశం నిర్వహించగా, మళ్లీ ఇప్పటివరకు అతీగతీ లేదు. అంతకుముందు సమావేశం 2022 జూలైలో నిర్వహించారు. అంటే 19 నెలల తర్వాత గత ఫిబ్రవరిలో మళ్లీ సమావేశం నిర్వహించారు. దానికి ముందు పరిస్థితి మరీ దారుణం. 2019 ఆగస్టు నుంచి 2022 జూలై వరకు 35 నెలల పాటు అసలు సమావేశమే కాకపోవడం గమనార్హం. ఇలా నెలలు, ఏళ్ల తరబడి జాప్యం చేయడమంటే తమపై ప్రభుత్వం, అధికారులు శీతకన్ను వేయడమేనని గిరిజన సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరి కొద్ది రోజుల్లో గ్రామపంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే సమావేశం నిర్వహించి ఏడాది దాటిందని, ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలంటే మరెంత కాలం పడుతుందోనని గిరిజనులు ఎదురుచూస్తున్నారు.
గత సమావేశంలో చర్చ సున్నా..
గిరిజన సమస్యలపై చర్చించాల్సిన సమావేశాలు అధికారుల ప్రగతి నివేదికలకు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకునేందుకే సరిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి 18న జరిగిన పాలకమండలి సమావేశానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. వీరు రాష్ట్ర కేబినెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నా.. ఇక్కడ మాత్రం గిరిజన సమస్యలపై సరైన చర్చ జరగలేదు. కేవలం వారికి అందిస్తున్న పథకాల గురించే మాట్లాడారని, అధికారులు సైతం ప్రగతి నివేదికలకే పరిమితమయ్యారని గిరిజనులు వాపోయారు.
సకాలంలో సమావేశాలు
నిర్వహించాలి
ఐటీడీఏ పాలకమండలి సమావేశాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలి. కానీ ఏడాది దాటినా ఆ ఊసే లేదంటే గిరిజనులపై ప్రభుత్వానికి, అధికారులకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. సమావేశం పెట్టినా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటికై నా స్పందించి వీలైనంత తొందరగా సమావేశం నిర్వహించడంతో పాటు గిరిజన సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. – ముర్ల రమేష్, కొండరెడ్ల
సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు
ఏడాది దాటినా నిర్వహించని ఐటీడీఏ సమావేశం
సమస్యలపై పట్టింపులేని ప్రభుత్వం, అధికారులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న
గిరిజన సంఘాలు
గిరిజనుల భాగస్వామ్యమేది..?
ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో తమకూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని గిరిజనులు, ఆయా సంఘాల నాయకులు కోరుతున్నారు. జిల్లాలో కోయ, లంబాడీ, కొండరెడ్డి, నాయకపోడు తదితర జాతుల గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. వీరి తరఫున పలువురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిరిజనుల సమస్యలు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణపై వారికి సంపూర్ణ అవగాహన ఉంది. కానీ ఐటీడీఏ సమావేశంలో వీరి భాగస్వామ్యం అంతంతమాత్రమే. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గత సమావేశ సమయంలో బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. దీంతో వేదికపై ఆయనకు స్థానం దక్కలేదు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రముఖ వైద్యుడిగా, ఆదివాసీ ఎమ్మెల్యేగా ఆయనకు ఈ ప్రాంత గిరిజనుల సమస్యలు బాగా తెలుసు. అలాంటి వారికి పాలక మండలిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
కొరవడిన చిత్తశుద్ధి
Comments
Please login to add a commentAdd a comment