
వట్టిపోతున్న వాగులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లావ్యాప్తంగా లోకల్ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఆరు నెలలుగా అడ్డూఅదుపు లేకుండా స్థానిక వాగుల నుంచి ఎడాపెడా ఇసుక తోడేస్తోంది. దీంతో వాగుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వాగుల వెంబడి ఏర్పాటు చేసిన చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు నిష్ఫలం అయ్యే ప్రమాదం ఉంది. భూగర్భ జలమట్టం కూడా పడిపోయే అవకాశం ఉంది. నిత్యం జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నా ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట పడటంలేదు.
తెలంగాణ శాండ్ మైనింగ్ రూల్స్
తెలంగాణ ఏర్పడ్డాక ఇసుక తవ్వకాలకు సంబంధించి 2015 జనవరిలో ప్రత్యేక జీఓ జారీ చేశారు. దీని ప్రకారం వాగులు, వంకలు, వర్రెలను కేటగిరీ–1, 2ల కింద పేర్కొన్నారు. కిన్నెరసాని వంటి ఉప నదులు కేటగిరీ–3లో ఉండగా, గోదావరి నది కేటగిరీ–4లో ఉంది. జిల్లాలో ప్రస్తుతం కేటగిరీ–4లో ఉన్న గోదావరిలోనే ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కిన్నెరసానితో సహా ముర్రేడు, పెద్దవాగు, గోధుమ తదితర వాగుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. మండలాల వారీగా ఎక్కడికక్కడ వెలిసిన సరికొత్త ఇసుక మాఫియాలు వాగులు, వంకల్లో రెచ్చిపోతున్నాయి. ఆరంభంలో కేవలం ఎడ్ల బండి ద్వారా స్థానిక అవసరాలు తీర్చారు. కానీ ఆ తర్వాత ఆర్గనైజ్డ్‌గా సహజ సంపదను లూటీ చేస్తున్నారు. రాత్రయితే చాలు జేసీబీల సాయంతో ఇసుక ఎడాపెడా తోడేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా స్టాక్ పాయింట్‌కు తరలించి అక్కడి నుంచి లారీల ద్వారా బయటి ప్రాంతాలకు ఇసుకను అమ్మేస్తున్నారు.
ప్రమాదకర స్థాయిలో..
వాగులు, వంకలు, వర్రెల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. అధికారులు వాల్టా చట్టం అమలు చేయడంలేదు. పగలు రాత్రి తేడా లేకుండా కూలీలు, జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో వాగుల్లోని ఇసుక తోడేస్తున్నారు. వారం పది రోజుల వ్యవధిలోనే వాగులు, వర్రెల్లోని ఇసుక మేటలు అదృశ్యమైపోతున్నాయి. వాగు అంచుల్లో ఇసుక తోడటంతో ఇప్పటికే ఒడ్డు కోతకు గురై వందల ఎకరాల వ్యవసాయ భూమి దెబ్బతిన్నది. లోతు ఎక్కువగా తోడటం వల్ల ఇసుక మేటలు కనీస స్థాయిలో లేక భూగర్భ జలాలు తగ్గే ప్రమాదానికి చేరువ అవుతున్నాం. ఫలితంగా వాగుల వెంబడి సాగు నీటికి బోర్లు వేయాల్సి దుస్థితి కూడా దాపురిస్తోంది. ఆఖరికి వంతెన సమీపంలో కూడా ఇసుకను వదిలేయడం లేదు. భారీగా ఇసుక తరలిస్తుండటంతో పలు వంతెనల మనుగడ ప్రమాదంలో పడింది.
నిషేధం ఉన్నా వాగుల్లో
యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
జిల్లాలో అమలుకు నోచుకోని
వాల్టా చట్టం
ఇసుక మాఫియా ధాటికి
రూపు కోల్పోతున్న వాగులు
వాల్టా చట్టానికి తూట్లు
వాల్టా చట్టం ప్రకారం ఇసుక మేటల దగ్గర ఉపరితలం నుంచి మూడు మీటర్లలోతు వరకే శాండ్ మైనింగ్ చేయాలి. అంతకు మించి లోతుకు వెళ్తే భూగర్భ జలమట్టం పడిపోతుంది. గట్టు నుంచి వాగు వెడల్పులో నాలుగోవంతు దూరం వదిలి, ఆ తర్వాత నుంచి ఇసుక తీయాలి. లేదంటే వరద వచ్చినప్పుడు గట్టు కోతకు గురై పంటపొలాలను నష్టపోవాల్సి ఉంటుంది. ఇక వాగుల్లో ఉండే వంతెనలకు ఇరువైపులా అర కిలోమీటరు దూరం వరకు ఇసుక తీయొద్దు. ఈ జాగ్రత్త పాటించకపోతే సదరు నిర్మాణాలు కూలిపోయే ప్రమాదముంది.
Comments
Please login to add a commentAdd a comment