ఫైర్‌కు లైన్స్‌తో చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఫైర్‌కు లైన్స్‌తో చెక్‌

Published Fri, Feb 28 2025 12:30 AM | Last Updated on Fri, Feb 28 2025 12:29 AM

 ఫైర్

ఫైర్‌కు లైన్స్‌తో చెక్‌

●రూ.55 లక్షలతో 489 కిలోమీటర్ల ఫైర్‌లైన్స్‌ ●జిల్లాలోని ఆరు డివిజన్లలో సాగుతున్న పనులు ●14 ఫైర్‌ బ్లో బృందాలనూ ఏర్పాటు చేసిన అటవీశాఖ ●అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

పాల్వంచరూరల్‌: వేసవికాలంలో అటవీ ప్రాంతంలో సంభవించే అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేస్తోంది. ఎండాకాలంలో అడవుల సంరక్షణకు ఈ ఏడాది ముందే దృష్టి సారించింది. జిల్లాలో అటవీ విస్తీర్ణం 4,28,698 చదరపు కిలోమీటర్లు ఉండగా, 6 డివిజన్లు, 24 రేంజ్‌లు, 944 బీట్లు ఉన్నాయి. వేసవి కాలంలో చెట్ల ఆకులు నేలరాలి ఎండిపోతుంటాయి. అడవిలోకి వెళ్లిన వారు బీడీలు, చుట్టలు, సిగరెట్లు కాల్చివేయడం ద్వారా ఎండిన ఆకులకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగి అడవి దహనమవుతుంటుంది. ఈ క్రమంలో అగ్ని ప్రమాదాల నివారణకు ఏటా అటవీశాఖ ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేస్తోంది. గతేడాది కిన్నెరసాని అభయారణ్యం, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం డివిజన్ల పరిధిలో రూ.19,45,197 కంపా నిధులతో 122.65 కిలోమీటర్ల మేర ఫైర్‌లైన్స్‌ నిర్మించింది. ఈ ఏడాది కూడా కంపా నిధులు కూడా రూ.55.60 లక్షలతో 489 కిలోమీటర్ల పరిధిలో ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేస్తోంది. వేసవిలో అటవీప్రాంతంలో మంటలు అంటుకోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఆరు డివిజన్ల పరిధిలో అధికంగా, తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను గుర్తించారు. గుండాల, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, చర్ల అటవీ ప్రాంతాలను ముప్పు ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా 14 ఫూర్‌ బ్లో బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

గిరిజన కూలీలకు ఉపాధి

అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాల నివారణకు అటవీ శాఖ ప్రతి సంవత్సరం చేపడుతున్న ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు పనులతో సుమారు వెయ్యి మంది గిరిజనులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. దాదాపు నెలరోజులపాటు కూలీలకు పని దొరుకుతుంది.

వాచర్ల నియామకం లేనట్లేనా..?

వేసవికాలంలో అడవులకు నిప్పు అంటుకుని ప్రమాదాలకు గురి కాకుండా ముందస్తు సమాచారం ఇచ్చేందుకు అటవీశాఖ ఫైర్‌వాచర్లను నియమిస్తుంది. ఏటా బీట్ల వారీగా నియామకాలు చేపడుతుంది. కానీ ఈ సంవత్సరం ఫైర్‌ వాచర్లను నియమించలేదు. అగ్ని ప్రమాదం సంభవించిన సమాచారం ఆలస్యంగా అందితే అడవులు కాలిపోతాయి. అయితే నిధుల కొరతతో ఫైర్‌వాచర్లను నియమించనట్లు తెలుస్తోంది.

ప్రత్యేక చర్యలు

జిల్లాలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఫైర్‌లైన్స్‌ నిర్మాణ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఫైర్‌లైన్స్‌ ద్వారా అగ్నిప్రమాదాల తీవ్రతను తగ్గించి పూర్తిస్థాయిలో అడవిని రక్షించగలుగుతున్నాం. వేసవిలో అధిక అగ్ని ప్రమాదాలు సంభవించే ఐదు ప్రాంతాలను గుర్తించాం. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం. అడవిలోకి ఎవరైనా అగ్గిపెట్టె తీసుకుని వెళ్లి నిప్పు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఫైర్‌ బ్లో ద్వారా కూడా అగ్ని ప్రమాదాలను నివారిస్తున్నాం.

–కృష్ణాగౌడ్‌, జిల్లా అటవీశాఖాధికారి

గతేడాది ఇలా..

2024–2025 సంవత్సరంలో 122.65 కిలోమీటర్ల ఫైర్‌లైన్ల విస్తరణకు రూ.19.45 లక్షలు ఖర్చు చేశారు. పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో 19.5 కిలోమీటర్లకు రూ.9.19 లక్షలు వ్యయం చేశారు. కొత్తగూడెం డివిజన్‌ పరిధిలో 22 కిలోమీటర్ల లైన్స్‌కు రూ.2.19 లక్షలు, భద్రాచలం డివిజన్‌ పరిధిలో 13.7 కిలోమీటర్లకు రూ.1.36 లక్షలు, మణుగూరు డివిజన్‌లో 15.75 కిలోమీటర్లకు రూ.1.75 లక్షలు, పాల్వంచ డివిజన్‌లో 19.70 కిలోమీటర్లకు రూ.2.70 లక్షలు, ఇల్లెందు డివిజన్‌ పరిధిలో 32.55 కిలోమీటర్లకు రూ.3.24 లక్షలు ఖర్చు చేశారు.

డివిజన్ల వారీగా కేటాయించిన నిధులు

డివిజన్‌ కిలోమీటర్లు వ్యయం

(రూ.లక్షల్లో)

కొత్తగూడెం 50 5.70

ఇల్లెందు 227 27.46

పాల్వంచ 15 1.23

మణుగూరు 75 7.83

భద్రాచలం 42 4.38

వైల్డ్‌లైఫ్‌ 80 9

No comments yet. Be the first to comment!
Add a comment
 ఫైర్‌కు లైన్స్‌తో చెక్‌1
1/2

ఫైర్‌కు లైన్స్‌తో చెక్‌

 ఫైర్‌కు లైన్స్‌తో చెక్‌2
2/2

ఫైర్‌కు లైన్స్‌తో చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement