● ఎయిర్‌పోర్టుపై రెండోసారి పూర్తయిన ఫీజిబులిటీ సర్వే ● వాతావరణ శాఖ నుంచి నివేదిక కోరిన విమానయాన శాఖ ● సానుకూల ఫలితాలు వస్తేనే విమానం ఎగిరే అవకాశం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎయిర్‌పోర్టు మంజూరుకు వాతావరణ శాఖ నివేదిక కీలకం కానుంది. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో సుమారు 900 ఎకరాల స్థలాన్ని ఇటీవల గుర్తించారు. ఈ ప్రాంతం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుకూలంగా ఉందా ? లేదా ? అని పరిశీలించేందుకు గత జనవరి 23న ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో ఫీజిబులిటీ సర్వే నిర్వహించింది. అనంతరం మరిన్ని వివరాలు కావాలంటూ కేంద్ర వాతావరణ శాఖను కోరింది. అక్కడి నుంచి వివరాలు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పరిస్థితులు ఎయిర్‌పోర్టుకు ఎంపిక చేసిన ప్రదేశంలో గాలుల తీరుతెన్నులు, వర్షాలు తదితర అంశాలను బేరీజు వేస్తారు. అప్పుడు సానుకూల ఫలితాలు వస్తే తదుపరి కార్యచరణ మొదలయ్యే అవకాశముంది. వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సాంకేతిక ఇబ్బందులు తొలగిపోవడంతో ఆ వివరాలను కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హైదరాబాద్‌లో మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టు వివరాలు కూడా తెలిపారు. భద్రాద్రి ప్రజలకు విమానయాన సౌకర్యం కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు అనుకూలమైన ప్రాంతం కోసం అన్వేషణ సాగుతోందన్నారు. గతంలో ఎంపిక చేసిన స్థలానికి సమీపంలో కొండలు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా నిలిచాయన్నారు. దీంతో మరో ప్రాంతంలో ఇటీవల ఫిజిబులిటీ సర్వే నిర్వహించామని, ఆ ప్రాంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ వాతావరణ శాఖను కోరామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment