ఉత్తిపోతలు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు 2024 ఆగస్టు 15 నాటికి అందివ్వాలనే లక్ష్యంతో గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు దృష్టి పెట్టారు. ఆ దిశగా అఽధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. సీతారామ ప్రధాన కాలువను నాగార్జున సాగర్ కాలువకు కలుపుతూ కొత్తగా రాజీవ్ కెనాల్‌ను తెర మీదకు తెచ్చారు. కాలువ నిర్మాణ పనుల కోసం రమారమీ రూ. 100 కోట్లు కేటాయించారు. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద భూసేకరణ చేపట్టారు. రేయింబవళ్లు యంత్రాలు పరుగులు పెట్టాయి. ఆగస్టు మొదటి వారం నాటికే వానలు విస్తారంగా కురవడం, నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండలా మారడంతో ఎన్‌ఎస్‌పీ కెనాల్‌కు సమృద్ధిగా కృష్ణా జలాలు అందాయి. దీంతో గోదావరి జలాలను కృష్టా ఆయకట్టకు తరలించే అవసరం లేకుండా పోయింది.
సిద్ధమైన పంప్‌హౌస్‌లు
రాజీవ్ కెనాల్ పనులు 2024 ఆగస్టు 15 నాటికి పూర్తవలేదు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి జూలూరుపాడు వరకు 102 కి.మీల ప్రధాన కాలువ దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో బీజీ కొత్తూరు, పూసుగూడెం (వీకేరామవరం), కమలాపురం దగ్గర ఉన్న మూడు పంప్‌హౌస్‌లలో రెండు వంతున మోటార్లను రెడీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ మూడు పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోశారు. ఇదే స్పీడ్‌లో పనులు జరిగి రాజీవ్ కెనాల్ అందుబాటులోకి వస్తే వేసవిలో నీటిని ఎత్తిపోయచ్చనే నమ్మకం కలిగేది.
పొంగిన గోదావరి
గత ఫిబ్రవరి చివరి వారంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు సాంకేతిక కారణాల వల్ల దుమ్ముగూడెం బరాజ్‌కి ఎగువన ఉన్న సమ్మక్క బరాజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఫిబ్రవరి 26 నాటికి దుమ్ముగూడెం ఆనకట్ట నిండి కిందకు నీరు ప్రవహించడం మొదలైంది. అప్పటికే మూడు పంప్‌హౌస్‌లలో రెండు వంతున మోటార్లు సిద్ధమై ఉండటంతో గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా వైరా రిజర్వాయర్‌కు తరలిస్తారా ? లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఎట్టకేలకు ఫిబ్రవరి 27న బీజీ కొత్తూరు పంప్‌హౌస్‌లో మోటార్లను ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోశారు. ఇక్కడి నుంచి ఈ నీరు ఎప్పుడెప్పుడు వైరా రిజర్వాయర్‌కు చేరుతుందా అని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది.
ప్రధాన కాలువకే పరిమితం
మొదటి పంప్‌హౌస్ నుంచి ఫిబ్రవరి 27న ఎత్తిపోసిన నీరు రెండో పంప్ హౌస్ వరకు చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి మూడో పంప్‌హౌస్‌కు నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎత్తిపోతల తీరును పరిశీలిస్తే రాజీవ్ లింక్ కెనాల్‌తో పాటు ఇతర పనులు పూర్తికానందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదావరి నీరు ఎన్‌ఎస్‌పీ కెనాల్‌కు పారే అవకాశం లేనట్టే. కేవలం సీతారామ ప్రధాన కాలువలో నిల్వకే అక్కరకు వచ్చేలా మారాయి.
దుమ్ముగూడెం ఆనకట్ట మీదుగా ప్రవహిస్తున్న గోదావరి
గత నెల 27న పంప్‌హౌస్–1లో మోటార్లు ప్రారంభం
రాజీవ్ లింక్ కెనాల్‌లో పూర్తికాని ప్యాచ్ వర్క్ పనులు
సీతారామ నీళ్లు ఎన్‌ఎస్‌పీ కాల్వకు
చేరే అవకాశం లేనట్టే!
పెండింగ్‌లోనే పనులు
రాజీవ్ కెనాల్ నిర్మాణ పనుల్లో 2024 ఆగస్టు 15 తర్వాత వేగం తగ్గింది. ఇప్పటికీ ప్రధాన కాలువపై విజయవాడ – జగదల్‌పూర్ జాతీయ రహదారిపై అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం దగ్గర వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. అదేవిధంగా రాజీవ్ లింక్ కెనాల్‌కు సంబంధించి గ్యాస్ పైప్ లైన్ దగ్గర నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు ఇటు ప్రధాన కాలువ, అటు రాజీవ్ కెనాల్‌లలో ఇప్పటికీ ప్యాచ్‌వర్క్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం దుమ్ముగూడెం ఆనకట్ట మీద నుంచి పొంగిపొర్లుతున్న గోదావరి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment