వేధిస్తున్న సిబ్బంది కొరత
● అటవీశాఖలో భర్తీకి నోచుకోని ఖాళీ పోస్టులు ● ఉన్న ఉద్యోగులపై అదనపు పనిభారం ● పర్యవేక్షణ కొరవడి అటవీ సంపదకు రక్షణ కరువు
చుంచుపల్లి: అటవీ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కిందిస్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా ఉన్న సిబ్బందిపై అదనపు పనిభారం పడుతోంది. దీంతో అటవీ సంపదకు రక్షణ కరువవుతోంది. సిబ్బంది తక్కువగా ఉండటంతో పర్యవేక్షణ లేక కొందరు పోడు నరుకుతున్నారని, వేటగాళ్లు వన్యప్రాణులను హతమార్చుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. అటవీ సంపదను రక్షించే క్రమంలో కొందరు సిబ్బంది దాడులకు కూడా గురవుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం, కిన్నెరసాని ఆరు అటవీ డివిజన్ల పరిధిలో 10.45 లక్షల ఎకరాల వరకు అడవి విస్తరించి ఉంది. జిల్లావ్యాప్తంగా అటవీ శాఖలో మొత్తం 684 మంది ఉద్యోగులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 529 మాత్రమే పనిచేస్తున్నారు. యూనిఫామ్ విభాగానికి చెందిన ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్(ఎఫ్‌డీఓ), రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారుల (ఎఫ్‌బీఓ) పోస్టులు 155 ఖాళీగా ఉన్నాయి. ఎఫ్‌డీఓలు ఆరుగురికి ప్రస్తుతం ఐదుగురే ఉన్నారు. ఇల్లెందు ఎఫ్‌డీఓ పోస్టు ఖాళీగా ఉంది. రేంజ్ ఆఫీసర్లు 25 మందికి 24 మంది, డీఆర్‌ఓలు 34 మందికిగానూ 29 మంది పనిచేస్తున్నారు. సెక్షన్ అధికారులు 89 మందికిగానూ 80 మంది ఉన్నారు. 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 535 బీట్ ఆఫీసర్ పోస్టులకు గానూ కేవలం 396 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు.
అటవీ డివిజన్లు: 6
మంజూరైన పోస్టులు: 684
ప్రస్తుత సిబ్బంది: 529
ఖాళీ పోస్టులు: 155
ఎఫ్‌బీఓలపై అదనపు భారం
అటవీ విస్తీర్ణానికి అనుగుణంగా బీట్ అధికారులను నియమించడంలేదు. బీట్ పరిధి ఎక్కువగా ఉండటంతోపాటు ఒక్క బీటుకు ఒక్కో అధికారి కూడా లేరు. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే బీట్, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో అటవీ సంపద రక్షణపై నిఘా కొరవడుతోంది. బీట్ ఆఫీసర్లకు జాబ్‌చార్ట్ లేకపోవడంతో అన్ని వేళలా విధులకు అందుబాటులో ఉండాల్సి వస్తోంది. సాధారణంగా వెయ్యి హెక్టార్ల భూవిస్తీర్ణం పరిధిలో ఒక బీట్ ఆఫీసర్ పని చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదు. దీంతో ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ఐదేళ్ల క్రితం ఎఫ్‌బీఓ పోస్టులను భర్తీ చేయగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో చాలామంది వెళ్లిపోయారు. ఉద్యోగ విరమణతో కూడా ఖాళీల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అటవీ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో అడవులపై పర్యవేక్షణ కొరవడుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలప స్మగ్లింగ్, అటవీ భూముల ఆక్రమణ జరుగుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అటవీ శాఖలోని ఖాళీ పోస్టులను భర్తీ చేసి అడవులను, వన్యప్రాణులను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment