రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
స్ఫూర్తి ప్రదాత శ్రీపాదరావు
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభకు వన్నె తెచ్చిన మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కలెక్టర్ అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీపాదరావు సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి శాసనసభ స్పీకర్‌గా ఎదిగారని పేర్కొన్నారు. న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు విశిష్ట సేవలు అందించిన ఆయన్ను 1999లో నక్సల్స్ కాల్చి చంపారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, బీసీ సంక్షేమాధికారి ఇందిర, జిల్లా క్రీడా శాఖాధికారి పరంధామరెడ్డి, డీఎం సివిల్ త్రినాథ్‌బాబు, మైనింగ్ శాఖాధికారి దినేష్ పాల్గొన్నారు.
క్రీడలపై దృష్టి సారించాలి
పోస్టల్ శాఖ ఎస్పీ వీరభద్ర స్వామి
పాల్వంచ: క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ క్రీడలపై దృష్టి సారించాలని పోస్టల్ శాఖ ఖమ్మం డివిజన్ ఎస్పీ వి.వీరభద్రస్వామి సూచించారు. ఇటీవల పాల్వంచ విద్యుత్ కళాభారతిలో జిల్లాస్థాయి వన్‌డే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దమ్మపేట, కారేపల్లి, కొమ్మినేపల్లి, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీల్లో ఇల్లెందు టీం విన్నర్‌గా, కారేపల్లి టీం రన్నర్‌గా నిలిచాయి. విజేతలకు ఆదివారం కేఎస్‌పీ రోడ్‌లోని వాసవీ హాల్‌లో బహుమతులు అందించారు. విన్నర్ జట్టుకు రూ.10,116, రన్నర్ టీంకు రూ.5,116 నగదు, ట్రోపీ వీరభద్రస్వామి అందించి మాట్లాడారు. కార్యక్రమంలో పాండురంగాపురం బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ బండి పుల్లారావు, ఏఐజీడీఎస్‌యూ తెలంగాణ సర్కిల్ సెక్రటరీ బండి జయరాజు, ఉపాధ్యక్షుడు వై.పట్టాభిరామయ్య, డివిజన్ సెక్రటరీ ఎండి.ఖాజామొహినుద్దీన్, ఖమ్మం డివిజన్ అధ్యక్షుడు ఎస్‌కె.మౌలాలి, జి.సాయితేజ పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల కోలాహలం
ఒకరోజు ఆదాయం రూ.21,055
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 302 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.10,325 ఆదాయం లభించగా, 250 మంది బోటుషికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.10,730 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
Comments
Please login to add a commentAdd a comment