కరుణించని దేవాదాయశాఖ
అమ్మవారి
కటాక్షం ఉన్నా..
పాల్వంచరూరల్: కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) గుడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. రోజూ వేలాది మంది అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. గురు, ఆదివారాల్లో రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. పరిసర గ్రామాల, పట్టణాల ప్రజలు ఏ పనులు ప్రారంభించాలన్నా తొలుత అమ్మవారిని దర్శించుకుంటారు. జిల్లాలో భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయం తర్వాత దేవాదాయ శాఖకు ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. టికెట్లు, కొబ్బరిచిప్పలు, అద్దెలు, తలనీలాలు, హుండీ ద్వారా ఏటా రూ.3.5 కోట్ల ఆదాయం వస్తున్నట్లు ఎండోమెంట్ అఽధికార లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల ఆలయ ప్రాంగణంలో నూతనంగా శివాలయం కూడా నిర్మించారు. దీంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయ ప్రాంగణంలో మౌలిక సౌకర్యాలు లేవు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కట్లు తప్పడంలేదు.
తాగునీరు కూడా లేదు..
ఆదాయం మెండుగా, భక్తుల రద్దీ అధికంగా ఉన్నా దేవాదాయ శాఖ, పాలకవర్గం వసతి సౌకర్యాలు కల్పించడంలేదు. ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు స్నానాలు చేసేందుకు గతంలో నిర్మించిన ఆరు బాత్ రూమ్‌లను కూల్చివేశారు. గుడికి ఎదురుగా ప్రధాన రహదారి దాటి వెళ్తే మరికొన్ని బాత్‌రూమ్‌లు ఉన్నాయి. అవి భక్తుల సంఖ్యకు తగినన్ని లేకపోవడంతోపాటు నిర్వహణ అధ్వానంగా మారింది. దీంతో స్నానాలగదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. అమ్మవారి దర్శనం కోసం ఒకే క్యూలైన్ ఉండగా, ఇబ్బంది తప్పడంలేదు. గతంలో ఆలయం ఎదురుగా ఉన్న చెట్ల కింద నైవేద్యం వండుకుని అమ్మవారికి సమర్పించేవారు. ఆ చెట్లు కూడా తొలగించడంతో నీడ కరువైంది. అక్కడ కొత్త భనవం నిర్మించడంతో వంటలు వండుకునే పరిస్థితి లేకుండాపోయింది.
పాలకవర్గం లేక ఏడాది
ఏడాది కాలంగా ఆలయానికి పాలకవర్గం లేదు. నూతన పాలకవర్గ నియామకంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసినా నియామక ప్రక్రియ మాత్రం ముందుకు సాగడంలేదు. దీంతో ఈఓ పర్యవేక్షణలో ఆలయంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో గత ఈఓ శ్రీనివాసరావు ఆలయాన్ని లోపలకు జరిపి పునర్నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటివరకు మోక్షం లేదు. ఆలయ అభివృద్ధిపై, సౌకర్యాల కల్పనపై దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు.
భక్తులు ఏం కోరుతున్నారంటే..
ఆలయంలో తాగునీటి సమస్య పరిష్కరించాలి. ప్రస్తుతం ఒకే క్యూలైన్ ఉన్నందున, అదనపు క్యూలైన్‌లు ఏర్పాటు చేయాలి. భక్తుల సంఖ్య తగినట్లు మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలి. పాల్వంచ, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ సర్వీసులు నడిపించాలి. అన్ని డిపోల, అన్ని రకాల సర్వీసులు ఆలయం వద్ద నిలిపేలా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక సత్రాలు, గదులు నిర్మించాలి. పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. భద్రాచలంలో మాదిరిగా నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలి.
స్నానాల గదులు ఏర్పాటు చేయాలి
పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకునే మహిళా భక్తులు కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా స్నానాల గదులు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలి . క్యూలైన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుంది.
–అరుణ, భక్తురాలు, మహబూబాబాద్
నిద్ర చేసేందుకు సత్రం నిర్మించాలి
అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆలయ సన్నిధిలో బస చేసేందుకు సౌకర్యంలేదు. దీంతో వచ్చిన రోజే తిరిగి వెళ్లిపోతున్నారు. నిద్ర చేసేందుకు సత్రం, గదులు నిర్మిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. తాగునీరు కూడా అందించాలి.
–శ్రుతి, భక్తురాలు, హైదరాబాద్
ప్రతిపాదనలు పంపాం
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎనిమిది బాత్‌రూమ్‌లు నిర్మిస్తున్నాం. మరో పది స్నానాల గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. మాస్టర్ ప్లాన్ అమలుకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు గతంలో ప్రతిపాదనలు పంపించాం. అనుమతులురాగానే పనులు ప్రారంభిస్తాం.
–ఎన్.రజనీకుమారి, ఈఓ
పెద్దమ్మతల్లి ఆలయం వద్ద కొరవడిన సౌకర్యాలు
రోజూ వేలాది మంది వస్తున్నా అరకొరగా బాత్‌రూంలు..
ప్రతిపాదించి రెండేళ్లయినా అమలుకు నోచుకోని మాస్టర్‌ప్లాన్
ఆదాయం ఉన్నా భక్తులకు వసతులు కల్పించని ఎండోమెంట్ శాఖ
కరుణించని దేవాదాయశాఖ
కరుణించని దేవాదాయశాఖ
కరుణించని దేవాదాయశాఖ
కరుణించని దేవాదాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment