నేడు ‘డయల్ యువర్ డీఎం’
చుంచుపల్లి: కొత్తగూడెం, ఇల్లెందు పట్టణ పరిసర ప్రాంతాల ఆర్టీసీ ప్రయాణికులకు సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం 99592 25959 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
అంతర్జాతీయ కథల పోటీల్లో బహుమతి
అశ్వారావుపేటరూరల్: అంతర్జాతీయ కథల పోటీల్లో అశ్వారావుపేటకు చెందిన బాలకథా రచయిత సిద్దంతాపు సాత్విక్‌కు బహుమతి లభించింది. తెలుగు తల్లి కెనడా, గడుగ్గాయి పిల్లల మాసపత్రిక నిర్వాహకులు అంతర్జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించారు. సాత్విక్ రాసిన ‘నిజాయితీ విలువ’ కథను పంపించగా ప్రత్యేక బహుమతికి ఎంపికై ంది. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని ఈ మెయిల్ ద్వారా పంపినట్లు బాలుడి తండ్రి ప్రభాకరాచార్యులు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో బహుమతి రావడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావు
అభినందనలు
చుంచుపల్లి: హనుమకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యాన మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో వాక్ ఫర్ ట్రీస్ నినాదంతో ప్రతిరోజు మొక్క నాటుతున్న కొత్తగూడెంకు చెందిన చిన్నారి విశ్వామిత్ర చౌహాన్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్‌రెడ్డి ఆయనను సన్మానించి మాట్లాడారు.
సింగరేణి కార్మికులు నేరుగా రిఫరల్‌కు..!
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికులు గతంలో ఏ రిఫరల్ కావాలన్నా ఆస్పత్రి చుట్టూ, హెడ్డాఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గని మేనేజర్, వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా లెటర్ అప్రూవల్ చేసుకుంటే సరిపోతుందని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ బి.జనక్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరంగా ఆస్పత్రిలో చేరిన ఉద్యోగి బంధువులు మెరుగైన వైద్యం కోసం గతంలో మాదిరిగా కార్యాలయాలు, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వెల్లడించారు. రెండు ఫొటోలతో కూడిన దరఖాస్తు తీసుకొస్తే కార్పొరేట్ ఆస్పత్రిలో రిఫరల్‌కు వెళ్లవచ్చునని తెలిపారు. ఈ విషయమై తాను సింగరేణి ఉన్నతాధికారులతో చర్చించడంతో అనుమతించారని, త్వరలోనే సర్క్యులర్ జారీ అవుతుందని పేర్కొన్నారు.
సింగరేణి ప్రధానాస్పత్రిలో ఖరీదైన శస్త్రచికిత్స
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ప్రధానాస్పత్రిలో ఓ మహిళకు ఖరీదైన శస్త్రచికిత్స నిర్వహించారు. సింగరేణి ఉద్యోగి భార్య గైనిక్ సమస్యతో బాధపడుతుండగా కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సీనియర్ గైనకాలజిస్ట్ మాలతి శస్త్రచికిత్స నిర్వహించి గర్భాశయంలో ఉన్న కణుతులను తొలగించారు. ఈ కేసును హైదరాబాద్‌కు రిఫర్ చేస్తే సుమారు రూ. 3 లక్షల వరకు ఖర్చయ్యేదని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్సలో డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ రవళి, థియేటర్ సిబ్బంది సహకరించారు.
బొగ్గు టిప్పర్ ఢీకొని ఒకరికి గాయాలు
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని గుంపెన గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. అబ్బుగూడెం గ్రామానికి చెందిన గడ్డం శ్రీను తన ద్విచక్రవాహనంపై ఎర్రగుంట నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. దీంతో శ్రీను కిందపడగా, అతని కాలుపై నుంచి టిప్పర్ టైరు వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయింది. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్‌ఎంపీ క్లినిక్ సీజ్
సత్తుపల్లిటౌన్: ఆర్‌ఎంపీలు ప్రాథమిక చికిత్స కాకుండా ఆస్పత్రుల పేరిట పడకలు ఏర్పాటు చేసి వైద్యం నిర్వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళావతిబాయి హెచ్చరించారు. సత్తుపల్లి ఎన్టీఆర్‌నగర్‌లో ఓ ఆర్‌ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్‌లో బెడ్లు ఉండడంతో పాటు ఫార్మసీ నిర్వహిస్తుండగా గురువారం ఆమె సీజ్ చేసి మాట్లాడారు. అనంతరం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న కంటి పరీక్షల శిబిరం, గంగారం పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలించారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
Comments
Please login to add a commentAdd a comment