మాస్టర్‌ ప్లాన్‌తోనే మహర్దశ | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ ప్లాన్‌తోనే మహర్దశ

Published Fri, Feb 28 2025 12:30 AM | Last Updated on Fri, Feb 28 2025 12:31 AM

మాస్ట

మాస్టర్‌ ప్లాన్‌తోనే మహర్దశ

● ఎదురుచూస్తున్న భక్తులు, స్థానికులు ● నవమి వేడుకల్లో రేవంత్‌ ప్రకటనపైనే కోటి ఆశలు ● తొలిసారి సీఎం హోదాలో హాజరయ్యే అవకాశం ● నిధులు కేటాయిస్తే ఆలయాభివృద్ధికి బాటలు

భద్రాచలం : దేశ వ్యాప్తంగా భక్తులు ఎదురుచూసే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 6న శ్రీరామనవమి, 7న పట్టాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. వీటికి ముందు ఉగాది రోజునే స్వామి వారి పెళ్లి పనులు ప్రారంభిస్తారు. ఈసారి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారి స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం ఉండగా నూతన మాస్టర్‌ ప్లాన్‌, నిధుల విడుదలపై ఏం ప్రకటన చేస్తారోనని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

గతేడాది ఎన్నికల కోడ్‌..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది జరిగే స్వామివారి కల్యాణం రెండోది. గత శ్రీరామనవమి సమయంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో సీఎం రేవంత్‌రెడ్డి కల్యాణానికి హాజరు కాలేదు. దీంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులే పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ సంవత్సరం నవమి వేడుకల సమయంలో ఎన్నికల కోడ్‌ ఉండే సూచనలు లేకపోవడంతో సీఎం హోదాలో ఆయన తొలిసారి హాజరవుతారని అంచనా. బీఆర్‌ఎస్‌ హయాంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌ 2014, 2015లో మాత్రమే స్వామివారి కల్యాణానికి హాజరయ్యారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులే పట్టువస్త్రాలు అందించే సంప్రదాయం కొనసాగింది. సుమారు దశాబ్ద కాలం తర్వాత సీఎం హాజరయ్యే అవకాశం ఉండగా, ఆలయాభివృద్ధికి ఎలాంటి ప్రకటన చేస్తారోనని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్నికలకు ముందే హామీ..

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 ఫిబ్రవరి 14న రేవంత్‌రెడ్డి భద్రాచలం వచ్చారు. రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్‌ మాట తప్పారని, తాము అధికారంలోకి వస్తే ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చాక 2024 మార్చి 11న మరోసారి భద్రాచలం రాగా, ఆలయంలో చేపట్టాల్సిన పనులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అధికారులతో చర్చించారు. భక్తులకు మౌలిక వసతులతో పాటు ఇతర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో దేవాదాయ శాఖ ఉన్నతాఽధికారులు, ఆలయాధికారులతో చర్చించి రామాలయంతో పాటు పర్ణశాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల నివేదికలు రూపొందించారు. ఆలయ మొదటి ప్రాకారం, దేవస్థానం, కల్యాణ మండపం రెండు వైపులా విస్తరణ, మాడ వీధులు, రాజ వీధుల విస్తరణ, కోనేరు నిర్మాణంతో పాటు రామాలయం నుంచి నృసింహస్వామి ఆలయం వరకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్డి, సంస్కృత, సంగీత పాఠశాల, పురుషోత్తపట్నంలో గోశాల నిర్మాణం, పర్ణశాల వద్ద దేవాలయం విస్తరణ, ప్రాకార మండపాల నిర్మాణం, కల్యాణ మండపం తదితర పనులతో ప్రణాళిక రూపొందించారని సమాచారం. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన స్థపతి సూర్యనారాయణ మూర్తి నూతన మాస్టర్‌ ప్లాన్‌ స్కెచ్‌లను సిద్ధం చేస్తున్నారు.

అభివృద్ధి చేసి చూపించాలి

భద్రాచలం అభివృద్ధికి ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌ రెడ్డి వెంటనే నిధులు ప్రకటించాలి. వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. ఇటీవల భక్తుల రాక పెరిగినందున వసతుల కల్పనపై దృష్టి సారించాలి.

– రేపాక రవికిరణ్‌, భద్రాచలం

బడ్జెట్‌లో కేటాయింపే కీలకం..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి భద్రాచలం దేవస్థానం అభివృద్ధి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. గత సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్లు ప్రకటించి.. బడ్జెట్‌లో కేటాయించినా నిధులు మాత్రం విడదల చేయలేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ముందు, ఆ తర్వాత హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా రామాలయ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని భక్తులు అంటున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మాస్టర్‌ ప్లాన్‌తోనే మహర్దశ1
1/1

మాస్టర్‌ ప్లాన్‌తోనే మహర్దశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement