డ్రోన్ సర్వేతో మాస్టర్ ప్లాన్
సూపర్‌బజార్(కొత్తగూడెం): పాల్వంచ మున్సిపల్ అభివృద్ధికి డ్రోన్ సర్వేతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన తదితరులతో కలిసి డ్రోన్‌కు పూజ చేసి సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు అన్నీ డిజిటలైజ్ చేయడమే లక్ష్యమని అన్నారు. అధునాతన సాంకేతికత, డ్రోన్ కెమెరాల సాయంతో పకడ్బందీగా సర్వే చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా రాష్ట్రంలో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన 20 మున్సిపాలిటీలను మాస్టర్‌ప్లాన్ డిజిటల్ సర్వేకు ఎంపిక చేయగా.. జిల్లాలో పాల్వంచ మున్సిపాలిటీకి చోటు దక్కిందని వివరించారు. ఈ సర్వేతో పాల్వంచ పట్టణం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉపగ్రహాలు, డ్రోన్ల సాయంతో ప్రాంతాల వారీగా ఉపరితలం ఎత్తు, పరిస్థితులు, రోడ్లు, ఇళ్లు, టాయిలెట్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్లు, సెల్ టవర్లు, రిజర్వాయర్లు, మార్కెట్లు, వైకుంఠధామాలను చిత్రీకరించి బేస్ మ్యాప్‌లను తయారు చేస్తారని వివరించారు.
సీతారామ బ్రిడ్జి పరిశీలన..
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని గుంపెన గ్రామ శివారులో సీతారామ కాల్వపై రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మించే క్రమంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన అప్రోచ్ రోడ్డును వెంటనే తొలగించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ అర్జున్, డీఈ భాస్కర్, ఆర్‌ఐ మధు పాల్గొన్నారు.
గొత్తికోయ ఆవాసాల్లో పర్యటన..
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక గ్రామపంచాయతీ పరిధిలోని చింతలమేది, మద్దిగుంపు గొత్తికోయ ఆవాసాల్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించారు. వారి జీవన స్థితిగతులు, అందుతున్న మౌలిక వసతులపై ఆరా తీశారు. ఆ రహదారిలో కారు వంటి వాహనాలు వెళ్లే వీలు లేకపోవడంతో మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్‌తో కలసి ద్విచక్రవాహనంపై చేరుకున్నారు. తాగునీటి కోసం అక్కడి గిరిజనులు ఏర్పాటు చేసుకున్న చెలిమలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ సంపదను కాపాడాలని, పోడు కొట్టడం చట్ట వ్యతిరేకమని, ఎవరూ చెట్లను నరకవద్దని సూచించారు. గొత్తికోయల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నామని, విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. చింతలమేదిలో నివసించే ఆరు కుటుంబాల వారు రోడ్డు సమీపంలోకి రావాలని, వారికి మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వగా త్వరలో తమ నిర్ణయం తెలియజేస్తామని స్థానికులు కలెక్టర్‌కు చెప్పారు. గ్రామంలో తాగునీరు కోసం సంపు నిర్మించాలని మిషన్ భగీరథ ఈఈని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ చలపతిరావు, మిషన్ భగీరథ డీఈ శివయ్య, ఏఈ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు
కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment