‘సీతారామ’ నీరు విడుదల
అశ్వాపురం: మండలంలోని బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ ఫేస్ – 1 పంప్‌హౌస్ ద్వారా అధికారులు గురువారం నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు రోజుల క్రితం వరకు ఆనకట్ట వద్ద నీరు తక్కువగా(49.1 మీటర్లు) ఉండడంతో తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి 1,200 క్యూసెక్కుల నీటిని ఇటీవల విడుదల చేశారు. కాగా, గురువారం 49.6 మీటర్లకు నీటి మట్టం చేరి ఆనకట్టపై గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ పంప్‌హౌస్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.
వారం రోజులుగా కసరత్తు..
సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నాగార్జునసాగర్ కెనాల్‌కు గోదావరి జలాలు తరలించేందుకు అధికారులు గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. కుమ్మరిగూడెం నుంచి జూలూరుపాడు వరకు సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ 112.4 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు ప్రవహించి ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించనున్నారు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు అడ్డుగా ఉన్న బెల్‌మౌత్ మట్టి కట్టను తొలగించడంతో నీరు మొదట అమెర్ద వద్ద హెడ్ రెగ్యులేటర్ వరకు వచ్చాయి. అక్కడి నుంచి బీజీ కొత్తూరు పంప్‌హౌస్ వరకు నీరు చేరింది. పంప్‌హౌస్ ద్వారా నీరు ఎత్తిపోయడంతో 43.9 కిలోమీటర్ల దూరంలోని ములకలపల్లి మండలం పూసుగూడెం ఫేస్–2 పంప్‌హౌస్‌కు చేరుతాయి. అక్కడ ఎత్తిపోస్తే 57.2 కిలోమీటర్ల దూరంలో కమలాపురంలో ఫేస్–3 పంప్‌హౌస్‌కు చేరుతాయి. ఆపై కాలువ ద్వారా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, జూలూరుపాడు వరకు చేరుతాయి. జూలూరుపాడులో 100.09 కిలోమీటర్ వద్ద నుంచి ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా 8 కిలోమీటర్లు పయనించి నాగార్జునసాగర్ కెనాల్‌లోకి చేరనున్నాయి.
పంప్‌హౌస్ నుంచి
సాగర్ కెనాల్‌కు తరలింపు
‘సీతారామ’ నీరు విడుదల
Comments
Please login to add a commentAdd a comment