చట్టాలపై అవగాహన అవసరం
జిల్లా న్యాయ సేవాధికారి
సంస్థ కార్యదర్శి భానుమతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): మహిళలకు చట్టాలపై అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గొల్లపూడి భానుమతి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో గురువారం మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భానుమతి మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడం నేరమని అన్నారు. ఈ వేధింపుల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. మహిళల రక్షణ కోసం చట్టం అనే బలమైన సాధనం ఉందన్నారు. మహిళా సాధికారతకు వ్యక్తులు, వ్యవస్థల సహకారం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. కలెక్టర్ పాటిల్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై సహోద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడితే బాధిత మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భవిష్యత్ ప్రణాళికలో ఆర్థిక అక్షరాస్యత కూడా కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. మహిళలు జీవనజ్యోతి, ప్రధానమంత్రి యోజన తదితర పథకాలను వినియోగించుకోవాలని, వాటిపై అవగాహన పెంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంరెడ్డి. డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ రాజబాబు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment