జాగా కొలిచేదెట్లా?
ఉమ్మడి జిల్లాలో భూ సర్వే సమస్యలు పేరుకుపోతున్నాయి. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వ్యవస్థతో హద్దులు, కొలతలకు సంబంధించిన అర్జీలు కూడా పెరిగిపోతున్నాయి. చాలా సర్వే నంబర్లలో భూ వివాదాలు నెలకొన్నాయి. మరోవైపు కొలత వేసి హద్దులు నిర్ధారించే, మ్యాపులు అందించే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోవడంలేదు. సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్, చైన్‌మన్లు ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఉన్నవారు పని ఒత్తిడిని ఎదుర్కొవాల్సివస్తోంది. –పాల్వంచరూరల్
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, చైన్‌మన్ తదితర 18 రకాల పోస్టులు ఉంటాయి. పెరుగుతున్న అవసరాల రీత్యా అదనపు పోస్టులను మంజూరు చేయకపోగా ప్రభుత్వం ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 114 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 74 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంకా 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కీలకమైన డిప్యూటీ సర్వేయర్ పోస్టులు 19 ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సర్వేయర్ 11, చైన్ మన్ పోస్టులు 3, ఇతర సిబ్బంది 9 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. భద్రాద్రి జిల్లాలో సర్వే ఇన్‌స్పెక్టర్ 1, సర్వేయర్ 2, డిప్యూటీ సర్వేయర్ 8, చైన్‌మన్ 1, ఇతర సిబ్బంది ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక మండలాల్లో అధికారుల కొరత ఉండటంతో ఇతర మండలాలవారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పనిభారం పెరిగి భూముల హద్దుల గుర్తింపు అర్జీలు పరిష్కరించలేకపోతున్నారు. ఫలితంగా భూ సర్వే కోసం దరఖాస్తుదారులు ఏళ్లతరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దశాబ్దాల నాటి రికార్డుల ప్రకారమే సర్వే చేయాల్సి వస్తుండగా, ఏళ్లు గడుస్తున్నా భూ హద్దుల వివాదం తేలడంలేదు. సరైన హద్దు రాళ్లులేక సర్కారు భూములు, బఫర్ జోన్, చెరువు శిఖం వంటివి ఆక్రమణకు గురవుతున్నాయి.
45 రోజుల్లో పరిష్కరించాల్సి ఉన్నా...
భూ పంపకాలు, భూ యజమానుల మధ్య గట్టు వివాదాలు తలెత్తినా, క్రయ, విక్రయాల సమయంలో సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటారు. నిబంధనల ప్రకారం సర్వే దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించి 45 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. సర్వేయర్లతో భూ కొలతలు తీసుకుని దరఖాస్తుదారుడికి నివేదికలు అందించాల్సి ఉంటుంది. కానీ సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ల కొరత కారణంగా భూ కొలతలు ఎప్పుడు చేపడతారో తెలియని పరిస్థితి నెలకొంది.
రీ సర్వే జరగక సమస్యలు జఠిలం..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, అటవీ ఇతర భూముల్లో రీ సర్వే జరగకపోవంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనేక చోట్ల స్పష్టమైన హద్దుల్లేక అనుభవదారుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. గ్రీవెన్స్‌డేతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో వీటికి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి సారించి సర్వేశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.
అదనపు పోస్టులేవి..?
నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత నూతన పోస్టులు మంజూరు కాలేదు. ఖాళీలూ భర్తీ చేయలేదు. దీంతో భద్రాద్రి జిల్లా ఏడీగా ఖమ్మం జిల్లా ఏడీ శ్రీనివాసరావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టం అమల్లోకి వస్తే భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు భూ పటం(నక్ష) తప్పనిసరి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిప్యూటీ సర్వేయర్ల పోస్టుల్లో పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల్లో ఆసక్తి కలిగిన వారిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఖాళీ పోస్టుల భర్తీపై భూమి కొలతలు, రికార్డుల నిర్వహణ శాఖ ఏడీ శ్రీనివాస్‌రావును వివరణ కోరగా.. సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు, ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. భూ సర్వేశాఖ పునర్ వ్యవస్థీకరణపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు.
ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే విభాగంలో సిబ్బంది కొరత
రెండు సర్వేయర్, 19 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఖాళీ
ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో 445 దరఖాస్తులు
ఏళ్లు గడుస్తున్నా హద్దులు, కొలతలు తేలని భూ వివాదాలు
ఉమ్మడి జిల్లాలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పోస్టుల వివరాలు..
జిల్లా మొత్తం పనిచేస్తున్న ఖాళీలు
పోస్టులు సిబ్బంది
ఖమ్మం 62 39 23
భద్రాద్రి 52 35 17
మొత్తం 114 74 40
దరఖాస్తుల వివరాలు ఇలా..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 2016 నుంచి ఇప్పటివరకు భూ కొలతల కోసం 7,123 దరఖాస్తులు అందాయి. ఇందులో 5,311 దరఖాస్తులను తిరస్కరించారు. 76 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 21 మండలాల నుంచి 2021 నుంచి ఇప్పటివరకు 13,726 దరఖాస్తులు రాగా, వీటిలో 6,354 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 369 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన అర్జీలను పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment