ఆపదలో అండగా..
సామాజిక బాధ్యత
ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతగా సింగరేణి స్పందిస్తోంది. సుశిక్షితులైన సింగరేణి రెస్క్యూటీం బ్రిగేడియర్లు తక్షణమే రంగంలోకి దిగుతున్నారు. మేడారం జాతర, శ్రీరామనవమి, పుష్కరాలు వంటి పర్వదినాలు, తుపానులు, గోదావరి వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మేమున్నామంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దీంతో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) సైతం ఆపత్కాలంలో సింగరేణి వైపు చూస్తోంది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో బాధితులను కాపాడే రెస్క్యూ ఆపరేషన్‌లో సింగరేణి తన వంతు సాయం అందిస్తోంది. ప్రతి ఏటా గోదావరి వరదలు, మేడారం జాతర వంటి సందర్భాల్లోనూ సేవలందిస్తోంది. బొగ్గు తవ్వకాలు ప్రారంభించిన తర్వాత భూగర్భంలో నీటి ఊటలు రావడం, పై కప్పు కూలిపోవడం, విషవాయువులు లీక్ అవడం వంటి ప్రమాదాలు జరిగేవి. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై కార్మికులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తారు. అయినా ఊహించని ప్రమాదాల వల్ల గనుల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సింగరేణి రెస్క్యూ టీమ్‌లను ఏర్పాటు చేసింది. అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఆధునిక పరికరాలను సమకూరుస్తోంది.
500 మందికి పైగా..
సింగరేణి సంస్థలో భూగర్భ గనుల్లో పని చేసే కార్మికుల్లో 21 నుంచి 30 ఏళ్లలోపు వయసు, ఫిజికల్ ఫిట్‌నెస్ ఉన్నవారు రెస్క్యూటీమ్‌లో చేరేందుకు అర్హులు. ఇలా ఎంపికై న వారికి రామగుండం రీజియన్ (గోదావరిఖని)లోని ప్రధాన రెస్క్యూ సెంటర్‌లో 14 రోజులపాటు శిక్షణ ఇస్తారు. తుపానులు, వరదలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్, అగ్నిప్రమాదాలు, నిర్మాణాలు కూలిపోవడం, రోడ్డు ప్రమాదాలు తదితర విపత్కర పరిస్థితుల్లో సేవలు ఎలా అందివ్వాలనే అంశాలను శిక్షణలో నేర్పిస్తారు. ఆ తర్వాత సంస్థలోని మూడు ప్రధాన రీజియన్లలో ఉన్న కొత్తగూడెం, భూపాలపల్లి, మందమర్రి రెస్క్యూ సెంటర్లకు వీరిని కేటాయిస్తారు. ఇక్కడ ప్రతీనెల రీజినల్ రిఫ్రెష్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. రీజినల్ సెంటర్లలో షిఫ్ట్‌నకు ఐదుగురు బ్రిగేడియర్లు, ముగ్గురు శిక్షకులు.. ఎనిమిది మందితో కూడిన బృందం సిద్ధంగా ఉంటుంది. గోదావరిఖనిలో పద్దెనిమిది మందితో కూడిన మూడు బృందాలు అప్రమత్తంగా ఉంటాయి. సంస్థవ్యాప్తంగా 500 మందికి పైగా బ్రిగేడియర్లు ఆపదల్లో సాయం చేసేందుకు రెడీగా ఉన్నారు.
ఆధునిక పరికరాలు
రెస్క్యూ బృందానికి చెందిన బ్రిగేడియర్లు వరదలు, అగ్నిప్రమాదాలు, జనసమ్మర్థం తదితర సమయాల్లో ఎలా స్పందించాలనే అంశాలపై శిక్షణ పొందినా ఆధునిక పరికరాల సాయం లేకుంటే ఆ నైపుణ్యాలు అక్కరకు వచ్చేది అంతంతే. దీంతో రెస్క్యూ బృందాలకు ఆధునిక పరికరాలు సమకూర్చడంలో సింగరేణి శ్రద్ధ పెట్టింది. ప్రమాదాలు జరిగినప్పుడు పెద్ద బరువులు ఎత్తేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్టులతోపాటు గ్యాస్ కట్టర్లు, స్ప్రెడర్లు, రాక్‌డ్రిల్స్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు కట్టర్లు, స్ప్రెడర్లు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లోనూ ఈ పరికరాలు ఉపయోగపడుతున్నాయి.
ఎస్‌ఎల్‌బీసీలో 250 మందితో..
ఎస్‌ఎల్‌బీసీ ఆపరేషన్‌లో సింగరేణి రెస్క్యూ బృందానికి చెందిన 250 మంది సభ్యులు గడిచిన రెండు రోజులుగా పాల్గొంటున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి 24 గంటలు సహాయక చర్యల్లో చెమటోడ్చుతున్నారు. టన్నెల్‌లో కూలిపోయిన బోరింగ్ మిషన్ భాగాలను గ్యాస్ కట్టర్ల సాయంతో తొలగిస్తున్నారు. టన్నెల్ ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు అడ్డుగా ఉన్న గడ్డర్లు, ఇనుప పైపులను తొలగించే పనిలో శ్రమిస్తున్నారు. దీంతోపాటు బాఽధితులు ఉన్న ప్రదేశాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకునేందుకు వీలుగా జీపీఐ (గ్రౌండ్ పెనట్రేటింగ్ పరికరాలు) బిగించే పనిలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. సీఎండీ బలరాంనాయక్, జీఎం అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
విపత్కర పరిస్థితుల్లో ఆదుకుంటున్న సింగరేణి రెస్క్యూ బృందాలు
నాలుగు రెస్క్యూ సెంటర్లు,
500 మందికి పైగా బ్రిగేడియర్లు
ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో 250 మంది సభ్యుల సేవలు
తుపానులు, వరదలు, పర్వదినాల్లోనూ ప్రజాసేవకు సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment