ఏసీబీకి చిక్కిన హెచ్‌ఎం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమేష్ కథనం ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కరాటే నేర్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పాఠశాలకు రూ.30 వేలు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో కొత్తగూడెంలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలకు రూ.30 వేలు విడుదల చేసింది. దీంతో ఓ శిక్షకుడి చేత విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షణ ఏప్రిల్‌తో ముగియనుంది. ఈ క్రమంలో కరాటే నేర్పించిన శిక్షకుడికి ఇప్పటికే రూ.10 వేలు చెల్లించారు. మిగతా రూ.20 వేలు తనకు ఇవ్వాలని పాఠశాల హెచ్‌ఎం తాటి రవీందర్ డిమాండ్ చేశారు. దీంతో శిక్షకుడు ఏసీబీకి సమాచారం అందించగా, వారు వలపన్ని హెచ్‌ఎంకు రూ.20 వేలు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. గత రెండు నెలల కాలంలో విద్యాశాఖలో ముగ్గురు అధికారులు ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. కాగా కూలీలైన్ పాఠశాలలో రెండు నెలలుగా గతంలో ఉన్న హెచ్‌ఎం, ప్రస్తుత హెచ్‌ఎం మధ్య వర్గపోరు జరుగుతోందని, పరస్పరం రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని, విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రూ.20 వేలు లంచం తీసుకుంటూ
పట్టుబడిన రవీందర్
Comments
Please login to add a commentAdd a comment