‘ఆఫ్‌టైప్’ నష్టాన్ని పూడ్చేదెవరు?
● నాణ్యతలేని ఆయిల్‌పామ్ మొక్కలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ● నష్టపరిహారం కోసం ఎదురుచూపులు ● నిబంధనలు పాటించని అధికారులు ● స్పందించని ఆయిల్ ఫెడ్ యాజమాన్యం
దమ్మపేట: తెలంగాణ ఆయిల్ ఫెడ్ పరిధిలోని నర్సరీల్లో మొక్కల పెంపకంలో అధికారుల సరైన పర్యవేక్షణ, నిబంధనలు పాటించని కారణంగా పంపిణీ చేసిన ఆఫ్‌టైప్ పామాయిల్ మొక్కల సాగుతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పరిహారం కోసం రైతులు ఎదురుచూస్తుండగా, ఆయిల్ ఫెడ్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 89 వేల ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ పంటను సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు వేల సంఖ్యలో ఆఫ్‌టైప్ మొక్కలు రావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమకు ఆఫ్‌టైప్ మొక్కలు వచ్చాయనే అవగాహన కూడా లేక వాటిని తొలగించి, కొత్త మొక్కలను నాటిన ఘటనలు అనేకం ఉన్నాయి. నర్సరీలో విత్తన దశ నుంచి మొక్కగా పెరుగుతున్నప్పుడే.. ఈ ఆఫ్‌టైప్, నాణ్యత లేని మొక్కలను గుర్తించలేకపోవడం, ఆయిల్ ఫెడ్ నర్సరీ అధికారుల అసమర్థతకు నిదర్శనమని రైతులు ఆరోపిస్తున్నారు. మొక్కల పెంపకానికి అవసరమైన విత్తనాల ఎంపికలో కూడా ఆయిల్ ఫెడ్ అధికారులు నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో ఐదేళ్లపాటు సొంత పెట్టుబడితో మొక్కలను పెంచిన తర్వాత అవి ఆఫ్‌టైప్‌కి చెందినవని, వాటి వల్ల ఏమాత్రం దిగుబడి రాదని తెలియడంతో రైతులు నిర్ఘాంత పోయారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. దీంతో పంట దిగుబడి రాని చెట్లను జేసీబీల సాయంతో పెకిలించారు.
నర్సరీలో మొక్కల పెంపకం
తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నర్సరీలో విత్తనాల నుంచి పామాయిల్ మొక్కలను పెంచుతారు. కొస్టారికా, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి మేలు రకం విత్తనాలను తీసుకొచ్చి, వీటి ద్వారా మొక్కలను నాలుగు నెలల పాటు షేడ్ నెట్‌లో పెంచుతారు. ఈ మొక్కల పెంపకాన్ని ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించి, ఆయిల్ ఫెడ్ పరిధిలోని అధికారులు, సూపర్‌వైజర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి. అనంతరం ఎనిమిది నెలల పాటు బయట ప్రదేశంలో పెంచుతారు. మొక్కలు షేడ్ నెట్‌లో ఉండగానే ఎదుగుదలలో లోపాల ఆధారంగా, ఈ ఆఫ్‌టైప్, నాణ్యత లేని మొక్కలను ముందుగానే గుర్తించవచ్చు. కానీ అధికారులు ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యహరించారని తెలుస్తోంది. ఆఫ్‌టైప్ మొక్కలను గుర్తించిన వెంటనే నిబంధనల ప్రకారం వాటిని నర్సరీ నుంచి తొలగించాలి. ఏడాదిపాటు మొక్కల పెంపకం పూర్తయిన అనంతరం, వాటిలో కొన్ని మొక్కలను నమూనాలుగా సేకరించి, నాణ్యత నిర్ధారణ కోసం ఏపీలోని ఏలూరు జిల్లా పెదవేగిలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చ్ సెంటర్‌కు పంపాలి. అక్కడ ఉద్యాన పంటల శాస్త్రవేత్తలు నాణ్యతను పరిశీలించి సాగుకు యోగ్యమైననని నిర్ధారించిన తర్వాత మాత్రమే రైతులకు మొక్కలను పంపిణీ చేయాలి. కానీ, ఏనాడు మొక్కలను పరిశీలనకు పంపిన సందర్భాలే లేవని రైతులు చెబుతున్నారు.
నిబంధనల అతిక్రమణ
విత్తనాల ఎంపికలో ఆయిల్ ఫెడ్ అధికారుల నిబంధనల అతిక్రమణ, అసమర్థత కారణంగానే ఎక్కువ సంఖ్యలో ఆఫ్‌టైప్, నాణ్యతలేని మొక్కలు నర్సరీలో పెరిగాయనేది రైతుల ఆరోపణ. నర్సరీలోని షేడ్ నెట్‌లో ఉండగానే నాణ్యత లేని, ఆఫ్‌టైప్ మొక్కలను అధికారులు గుర్తించాలి. అశ్వారావుపేట డివిజన్ నర్సరీలో 2016 నుంచి 2024 వరకు పంపిణీ చేసిన మొక్కల్లో చాలావరకు నాణ్యతలేని, ఆఫ్‌టైప్ మొక్కలు ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. విత్తన కంపెనీలతో అధికారుల లోపాయికారీ ఒప్పందాలు, నాణ్యతలో రాజీపడి ఈ నాణ్యత లేని, ఆఫ్‌టైప్ మొక్కలను నర్సరీల్లో పెంచారని సమాచారం. ఆఫ్‌టైప్, నాణ్యత లేని మొక్కలతో కొంతమంది రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఎకరా విస్తీర్ణంలో 50 నుంచి 57 పామాయిల్ మొక్కలను సాగు చేస్తారు. వీటిల్లో ఒకటి లేదా రెండు మొక్కలు ఆఫ్‌టైప్ రావడం సాధారణమే. కానీ, ఎకరంలో ఐదు నుంచి ఇరవై వరకు ఆఫ్‌టైప్, కల్లింగ్ మొక్కలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల పాటు మొక్కలను సాకిన తర్వాత అవి ఆఫ్‌టైప్ అని తెలియడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
పరిహారం చెల్లించాలి
ఆఫ్‌టైప్ మొక్కలతో నష్టపోయిన వారికి మొక్కల సంఖ్య ఆధారంగా పరిహారం చెల్లించాలి. పట్వారిగూడెం, జగ్గారంలో 30 ఎకరాల్లో 2016 – 17లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించా. అందులో 150 ఆఫ్‌టైప్, 100 నాణ్యత లేని, అంతగా దిగుబడి రాని మొక్కలుగా తేలాయి. పరిహారం కోసం ఆయిల్ ఫెడ్ అధికారులను సంప్రదిస్తే కొత్త మొక్కలు మాత్రమే ఇస్తామని చెప్పారు.
–చెలికాని సూరిబాబు,
జగ్గారం, దమ్మపేట మండలం
నేనే సరిగ్గా సాగు చేయలేదన్నారు..
2018లో 12 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు మొదలు పెడితే ఐదేళ్ల అనంతరం దిగుబడి సమయాన 250 ఆఫ్‌టైప్ మొక్కలు ఉన్నాయని తేలింది. సూపర్‌వైజర్లు కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఆయిల్ ఫెడ్ నుంచి స్పందన లేక హైకోర్టును ఆశ్రయించా. దీంతో నాకు న్యాయం చేయాలని సూచించింది. కానీ, నేను సరిగా సాగు చేయలేదంటూ రిట్ వేసినట్టు తెలిసింది.
–పుచ్చకాయల సోమిరెడ్డి, రైతు,
నారాయణపురం, సత్తుపల్లి మండలం
కొత్త మొక్కలు ఇస్తున్నాం
ఆఫ్‌టైప్ మొక్కల ద్వారా నష్టపోయిన రైతులకు వాటి స్థానంలో కొత్త మొక్కలను ఉచితంగా అందజేస్తున్నాం. నేను ఈ మధ్యనే చార్జ్ తీసుకున్నాను. ఆఫ్‌టైప్ మొక్కలు వచ్చినట్లు ఇప్పుడిప్పుడే నా దృష్టికి వస్తోంది. కానీ, ఆఫ్‌టైప్ మొక్కలకు నష్ట పరిహారం ఇవ్వాలనే అంశంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నా పరిధిలోనిది కాదు.
–నాయుడు రాధాకృష్ణ,
నర్సరీ ఇన్‌చార్జ్, అశ్వారావుపేట
‘ఆఫ్‌టైప్’ నష్టాన్ని పూడ్చేదెవరు?
‘ఆఫ్‌టైప్’ నష్టాన్ని పూడ్చేదెవరు?
‘ఆఫ్‌టైప్’ నష్టాన్ని పూడ్చేదెవరు?
‘ఆఫ్‌టైప్’ నష్టాన్ని పూడ్చేదెవరు?
Comments
Please login to add a commentAdd a comment