ట్రాక్టర్‌ పైనుంచి పడి డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ పైనుంచి పడి డ్రైవర్‌ మృతి

Published Sat, Mar 1 2025 8:41 AM | Last Updated on Sat, Mar 1 2025 8:37 AM

ట్రాక

ట్రాక్టర్‌ పైనుంచి పడి డ్రైవర్‌ మృతి

టేకులపల్లి: ట్రాక్టర్‌ పైనుంచి జారి.. ఇంజన్‌ కిందపడి డ్రైవర్‌ మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ బి.నరసింహారావు కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్‌తండాకు చెందిన మూతి ముత్తేశ్‌ (38) అదే గ్రామానికి చెందిన బాదావత్‌ హరిరామ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కోయగూడెంలోని ఓ రైతు మిర్చి తోటలో పనిచేసిన మధ్యప్రదేశ్‌ కూలీలను ట్రాక్టర్‌లో తీసుకొస్తున్న క్రమంలో బావోజీతండా క్రాస్‌రోడ్‌లోని ముత్యాలమ్మ గుడి వద్దకు రాగానే ముత్తేశ్‌ అదుపుతప్పి ఎడమవైపు ఇంజన్‌ వెనుక టైర్‌ కింద పడ్డాడు. ట్రాక్టర్‌లో ఉన్న కూలీలు కేకలు వేస్తూ కొందరు కిందకు దూకేశారు. ఓ ఇద్దరు కూలీలు ధైర్యం చేసి ఇంజన్‌ మీదకు వెళ్లి బ్రేక్‌పై వేయడంతో పత్తి చేనులోకి వెళ్లి ఆగింది. ముత్తేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్తలాన్ని టేకులపల్లి సీఐ సురేశ్‌ సందర్శించి, వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆటో, బైక్‌ ఢీ : ఒకరు మృతి

బూర్గంపాడు: ఆటో, బైక్‌ ఢీకొన్న ఘటనలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఇరవెండి, మోతె గ్రామాల మధ్య ఆటో, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న, అశ్వాపురానికి చెందిన బండ్ల శ్రీనివాసరావు (35)రోడ్డుపక్కన పొదల్లో పడిపోయాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. అయితే అతను అప్పటికే మృతిచెందాడు. మృతుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సారపాకకు చెందిన ఉషశ్రీతో అతనికి వివాహమైంది. వారికి మూడేళ్ల పాప, నెలరోజుల బాబు ఉన్నారు. సారపాకలోని అత్తగారింటికి వచ్చి తిరిగి మోటార్‌ సైకిల్‌పై అశ్వాపురానికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆటోడ్రైవర్‌, మరో ఇద్దరు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

ఇల్లెందురూరల్‌: మండలంలోని సుభాష్‌నగర్‌ గ్రామ శివారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈర్ల భరత్‌ (20) మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన నర్సింహారావు, సుశీల దంపతుల రెండో కుమారుడు ఈర్ల భరత్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఖమ్మంలో ఉంటున్నారు. మూడు రోజుల కిందట స్నేహితుని పుట్టినరోజు వేడుక పేరుతో ఇల్లెందుకు వచ్చిన భరత్‌.. ఇతర స్నేహితులతో కలిసి లాడ్జ్‌లో దిగినట్లు సమాచారం. మూడు రోజులు లాడ్జ్‌లోనే గడిపిన భరత్‌ శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై టేకులపల్లికి బయలుదేరాడు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైక్‌ అదుపుతప్పి కింద పడటంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భరత్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ట్రాక్టర్‌ పైనుంచి పడి డ్రైవర్‌ మృతి 1
1/2

ట్రాక్టర్‌ పైనుంచి పడి డ్రైవర్‌ మృతి

ట్రాక్టర్‌ పైనుంచి పడి డ్రైవర్‌ మృతి 2
2/2

ట్రాక్టర్‌ పైనుంచి పడి డ్రైవర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement