పతులకు ఫైన్ !
● స్థానిక సంస్థల్లో మహిళా ప్రజా ప్రతినిధులకు అధికారం అంతంతే.. ● 50 శాతం రిజర్వేషన్లు ఉన్నా పురుషుల ఆధిపత్యమే ● అనధికార పెత్తనం తగ్గించేందుకు కేంద్రం చర్యలు ● త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు
పెత్తనం మగాళ్లదే..
స్థానిక సంస్థల్లో 50 శాతం, అంతకు మించి మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పడానికి ఘనంగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. అనేక చోట్ల పెత్తనమంతా ఎన్నికై న మహిళల కుటుంబంలోని మగవారి చేతుల్లోనే ఉంటోంది. ముఖ్యంగా భార్యలు ప్రజాప్రతినిధులుగా ఉన్న చోట భర్తలే అసలైన అధికారం చలాయిస్తున్నారు. మరి కొన్నిచోట్ల కుమారులు, సోదరులు, తండ్రులు కూడా అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని మహిళలను నామ్ కే వాస్తే ప్రజాప్రతినిధులుగా మారుస్తున్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడం, ప్రతిపాదనలు రూపొందించడం, ప్రారంభోత్సవాలు తదితర అన్ని పనుల్లో పురుష పెత్తనమే ఎక్కువైంది. అధికారులు సైతం సదరు ప్రజాప్రతినిధుల కుటుంబంలోని మగవారికే అన్ని విషయాలు చెబుతూ పెత్తనానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. చివరకు అధికారిక సమావేశాలు, గ్రామ/వార్డు సభల్లోనూ తమకు కుర్చీలు ఎందుకు వేయడం లేదనే వరకు ఈ పరిస్థితి రావడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తిని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అనధికారిక పెత్తనం చలాయిస్తున్న పురుషుల దూకుడుకు కళ్లెం వేయనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం తీసుకోబోయే చర్యలు ఆసక్తికరంగా మారాయి.
మహిళలకు పెద్దపీట..
రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు క్షేత్ర స్థాయిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను కీలకంగా మార్చారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. తెలంగాణలో అవి 50 శాతానికి చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ వరకు, పట్టణాల్లో కౌన్సిలర్ మొదలు మేయర్ వరకు ఆయా సామాజిక వర్గాల వారీగా మహిళలకు సీట్లు కేటాయించారు. దీంతో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. 50 శాతం రిజర్వేషన్‌తో పాటు స్థానిక పరిస్థితులు, బలమైన నాయకత్వం ఉన్న చోట జనరల్ స్థానాల్లోనూ మహిళలే పోటీలో ఉంటున్నారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో కొన్ని చోట్ల వారి ప్రాతినిధ్యం 50 శాతం కంటే ఎక్కువగానే ఉంటోంది.
సలహా మండలి సిఫారసులు..
స్థానిక సంస్థల్లో మహిళా ప్రజాప్రతినిధుల కుటుంబానికి చెందిన మగవారి పెత్తనాల అంశం 2023లో సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతింటోందని, దీనిపై దృష్టి సారించాలని కేంద్రానికి సుప్రీం సూచన చేసింది. దీంతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ అంశంపై నివేదిక ఇవ్వాలంటూ సలహా మండలిని ఏర్పాటు చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన సలహా మండలి.. మహిళా రిజర్వేషన్ల అమలు తీరు, మగవారి పెత్తనంపై వివరాలు సేకరించింది. కేంద్రానికి పలు సూచనలు చేస్తూ ఇటీవల నివేదిక సమర్పించింది.
జరిమానాలు విధించేలా..
మహిళా ప్రజాప్రతినిధులు ఎన్నికై న చోట వారి కుటుంబ సభ్యులు పెత్తనం చలాయిస్తే జరిమానా (పెనాల్టీ) విధించాలనే సలహా మండలి సిఫార్సును కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ అంశంపై క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్లు, మహిళా పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయనుంది. అనధికారిక పురుష పెత్తనంపై సహేతుకమైన ఆధారాలతో ఫిర్యాదులు అందించే విజిల్ బ్లోయర్స్ (సామాజిక కార్యకర్తలు)కు నజరానాలు సైతం అందించాలని యోచిస్తోంది. ఈ మేరకు విధివిధానాలు సిద్ధం చేసి త్వరలో అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
త్వరలోనే స్థానిక ఎన్నికలు..
జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల గడువు తీరిపోయింది. ఈ ఏడాది వేసవిలో స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేలా సన్నాహాలు చేస్తోంది. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆసక్తి గల వారు తమకు రిజర్వేషన్లు అనుకూలించకుంటే తమ కుటుంబంలోని మహిళలను నిలిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గతంలో మాదిరిగా రాబోయే రోజుల్లో అనధికారిక పెత్తనం చలాయించే అవకాశాలు ఉంచకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. కొత్త మార్పులు అమల్లోకి వస్తే రాజకీయ, పాలనా పరమైన అంశాల్లో మహిళలకు మరింత న్యాయం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వార్డు మెంబర్లు 4,232
సర్పంచ్‌లు 479
ఎంపీటీసీలు 236
జెడ్పీటీసీలు 22
నాలుగు మున్సిపాలిటీల్లో వార్డులు 103
Comments
Please login to add a commentAdd a comment