స్కూల్ స్కీముల్లో స్కామ్‌లు !
● బాలికల ఆత్మరక్షణ శిక్షణపై ప్రచారం శూన్యం ● గుట్టుగా నిధులు స్వాహా చేస్తున్న వైనం ● ఇన్‌స్ట్రక్టర్లుగా అనర్హుల నియామకం ● వాటాలు పంచుకుంటున్న హెఎంలు, శిక్షకులు ● ఏసీబీకి పట్టుబడడంతో విషయం వెలుగులోకి..
కొత్తగూడెంఅర్బన్: బాలికలు, యువతులు, మహిళలపై దాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు దాడుల నుంచి స్వీయ రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్నాయి. బాల్యం నుంచే వారు ధైర్యంతో ముందుకుసాగితే భవిష్యత్‌లో ఎలాంటి ఘటనలు ఎదురైనా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో బాలికలకు విద్యార్థి దశలోనే కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అవి కాగితాలకే పరిమితమవుతుండగా.. బాలికలు శిక్షణకు నోచుకోవడం లేదు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన వేతనం ఇస్తున్నా.. కొందరు మాత్రం అదనపు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
బాలికల ఆత్మరక్షణకు..
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదివే బాలికలకు కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు 2018లో ప్రభుత్వం రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్షా ప్రశిక్షణ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించగా, నాలుగేళ్ల క్రితం పీఎం శ్రీ కింద మరో స్కీమ్ ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో ఈ రెండు పథకాలపై ప్రచారం చేయడం, బాలికలకు శిక్షణ ఇప్పించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికలకు మూడు నెలల పాటు శిక్షణా తరగతులు నిర్వహించాల్సి ఉండగా విద్యాశాఖ అధికారులు ఒక్క రోజు కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు. దీంతో కరాటే శిక్షణకు విడుదలవుతున్న నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శిక్షణ ఇలా..
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు మూడు నెలల పాటు కరాటే శిక్షణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ మేరకు ఇన్‌స్ట్రక్టర్లను నియమించి జనవరి నుంచి ఏప్రిల్ వరకు శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థినులకు రోజు వారీ బోధనతో పాటు ఈ మూడు నెలలు అదనంగా మరి కొంత సమయం కేటాయించి శిక్షణ ఇప్పించాలి. అయితే సమయం సరిపోవడం లేదనే సాకుతో బాలికలకు శిక్షణ ఇప్పించడం లేదని, నిధులు మాత్రం హెచ్‌ఎంలు, ఇన్‌స్ట్రక్టర్లు వాటాలుగా పంచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా శుక్రవారం కొత్తగూడెం కూలీలైన్ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంకు, ఇన్‌స్ట్రక్టర్‌కు మధ్య విఽబేధాలు రావడం, ప్రధానోపాధ్యాయుడిపై శిక్షకుడు ఏసీబీకి ఫిర్యాదు చేసి పట్టించిన విషయం తెలిసిందే. అయితే మిగతా పాఠశాలల్లోనూ ఇదే తంతు సాగుతున్నా గుట్టుచప్పడు కాకుండా పంపకాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక పాఠశాలల్లో శిక్షకులను జిల్లా క్రీడా శాఖాధికారి ఎంపిక చేయాల్సి ఉండగా, జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇందులోనూ అనర్హులకు స్థానం కల్పించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంపికై న పాఠశాలలు ఇవే..
బాలికలకు కరాటేలో శిక్షణ ఇప్పించేందుకు జిల్లాలో రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్షా ప్రశిక్షణ పథకం కింద 183 పాఠశాలలు, పీఎంశ్రీ పథకం కింద 17 పాఠశాలలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఇన్‌స్ట్రక్టర్లకు ఇప్పటికే సగం వరకు డబ్బులు ముట్టాయి. ఒక్కో పాఠశాలలో శిక్షణ పొందే విద్యార్థినులు 50 మందికి పైగా ఉంటే నెలకు రూ.10 వేలు, 50 మందికి తక్కువగా ఉంటే రూ.5వేల చొప్పున మూడు నెలల పాటు విడుదల చేస్తారు. పీఎంశ్రీ కింద జిల్లాలోని 16 పాఠశాలలకు నెలకు రూ.10 వేలు, ఒక పాఠశాలకు రూ.5 వేల చొప్పున విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించే రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్ష పథకం కింద కూడా 183 పాఠశాలకు అలాగే నిధులు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర విద్యాశాఖ నుంచి ప్రొసీడింగ్స్ ఆలస్యంగా రావడంతో ఫిబ్రవరిలోనే కరాటే క్లాసులు ప్రారంభమైనట్లు పాఠశాలల హెఎంలు నమోదు చేసుకున్నారు. అయితే శిక్షణ అన్ని పాఠశాలల్లో కూడా కాగితాలకే పరిమితమైందని, బాలికలకు కరాటే నేర్పించడం లేదని తెలుస్తోంది.
శిక్షణ అందించని పాఠశాలలపై చర్యలు..
జిల్లాలోని ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ ఇప్పిస్తున్నాం. శిక్షణ ఇవ్వని పాఠశాలలపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేసిన పాఠశాలల్లో తప్పని సరిగా కరాటే శిక్షణ తరగతులు నిర్వహించేలా హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలి.
– వెంకటేశ్వరా చారి, డీఈఓ
స్కూల్ స్కీముల్లో స్కామ్‌లు !
Comments
Please login to add a commentAdd a comment