‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఐడీఓసీలో శనివారం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగుతాయని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 73 కేంద్రాల్లో 12, 282 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. పరీక్షలకు 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఏడుగురు రూట్ అధికారులు, 73 మంది డిపార్టుమెంటల్ అధికారులను నియమిస్తున్నట్లు వివరించారు. పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధాన పత్రాల బండిళ్లను పోస్టాఫీసులకు తరలించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలాని పోలీస్ అధికారులను ఆదేశించారు.
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి..
పరీక్ష కేంద్రాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు రెండు రోజుల్లో పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్‌ను అమలు చేయాలని అన్నారు. పరీక్షల సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని, విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆయా అధికారులను ఆదేశించారు. ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సమస్య వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ వెంకటేశ్వరాచారి, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మహేందర్ పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి..
భూముల క్రమబద్ధీకరణకు జిల్లాలో దాఖలైన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మొబైల్ యాప్ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఇందుకోసం నీటిపారుదల శాఖ అధికారులు ఆయా శాఖల సిబ్బందికి ప్రతీ రోజు లక్ష్యాలను నిర్దేశించాలని, నీటి వనరుల బఫర్‌జోన్, ఎఫ్‌టీఏల్లో స్థలాలు ఉంటే అనుమతించవద్దని సూచించారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ సమయంలో నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి రెండు వారాల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment